రాజుగారి గది 3 – రివ్యూ

  • Edited By: sekhar , October 18, 2019 / 09:47 AM IST
రాజుగారి గది 3 – రివ్యూ

‘రాజు గారి గది’ అనే వెరైటీ అండ్ క్యాచీ టైటిల్‌తో ఫస్ట్ హిట్ అందుకున్న ఓంకార్.. తనకు డైరెక్టర్‌గా లైఫ్ ఇచ్చిన ఆ సినిమా టైటిల్ మీద ప్రేమని వదులుకోలేకపోతున్నాడు. అందుకే ఏ సినిమా తీసినా కూడా రాజు గారి గదికి సీక్వెల్‌గా పేరు పెడుతున్నాడు. ఇప్పుడు కూడా తన తమ్ముడు అశ్విన్ హీరోగా రాజు గారి గది 3 అనే సినిమా తెరకెక్కించాడు. ముందు తమన్నాని హీరోయిన్‌గా అనుకున్నారు.. కానీ, తరువాత ఆ స్థానంలోకి అవికా గోర్ వచ్చింది. ట్రైలర్‌తో భయపెడతాం అని, ప్రమోషన్స్‌లో నవ్విస్తాం అని చెప్పిన ఈ సినిమా టీమ్ చెప్పినట్టుగానే హారర్ కామెడీతో అలరించిందా లేక కిచిడీ కామెడీ అనిపించుకుందా అనేది ఇప్పుడు చూద్దాం.

 

కథ విషయానికి వస్తే : ఆటోడ్రైవర్ అయిన అశ్విన్ అతని మామ ఆలీతో కలసి ఓ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. రాత్రిళ్ళు తాగి గొడవ చేసే వీరిద్దరూ ఆ కాలనీ వాసులకు తలనొప్పిగా మారతారు. ఇక మాయ జూనియర్ డాక్టర్‌గా ఓ హాస్పటల్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఈమెతో పాటు పనిచేసే డాక్టర్ బ్రహ్మాజీ, ప్రేమిస్తున్నానంటూ మాయకి ఐ లవ్యూ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే వందల ఏళ్ల క్రితం ప్రయోగించిన ఓ మంత్ర శక్తి అనుకోకుండా మాయకి రక్షణగా ఉంటుంది. ఆ అమ్మాయి వెంట ఎవరు పడినా.. ప్రేమిస్తున్నానని చెప్పినా వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ మంత్ర శక్తి.. బ్రహ్మాజీని కూడా భయపెడుతుంది. ఇదంతా మలయాళ మాంత్రికుడైన తన తండ్రి గరుడ పిళ్లై చేయిస్తున్నాడని భావిస్తుంది మాయ. అదే సమయంలో ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన అశ్విన్‌‌ని ఇష్టపడుతుంది. అశ్విన్‌ కూడా మాయను లవ్ చేస్తాడు. కానీ తన పరిస్థితి గురించి తెలిసిన మాయ తరువాత మాట్లాడదాం అని చెప్పి కేరళ వెళ్లిపోతుంది. మాయ కోసం కేరళ వెళ్లిన అశ్విన్‌ మాయకు రక్షణగా ఉన్న శక్తి గరుడ పిళ్లై ప్రయోగించినది కాదని తెలుసుకుంటాడు. మరి ఆ శక్తిని ఎవరు ప్రయోగించారు..? ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది. దానిని  అంతం చేసి.. అశ్విన్‌, మాయలు ఎలా ఒక్కటయ్యారు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఆపరేషన్ గోల్డ్‌ ఫిష్ – రివ్యూ

నటీనటుల విషయానకొస్తే : రాజుగారి గది గత రెండు సినిమాల్లో కూడా నటించిన అశ్విన్‌కి ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. అతను కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతని నటనలో మెచ్యూరిటీ కనిపించింది. ఇక ఇప్పటివరకు కూడా క్యూట్ పాత్రల్లో ఆకట్టుకున్న అవికా ఇప్పుడు మాత్రం దెయ్యం పాత్రలో భయపెట్టాలని చూసింది. నటనలో బాగా అనుభవం ఉండడంతో ఆ పాత్రని బాగానే పోషించింది. తమన్నాతో పోల్చి చూడలేకపోయినాగానీ ఈ సినిమాలో ఆమె పాత్ర వరకు న్యాయం చేసింది. అలీ కూడా ఆకట్టుకున్నాడు, అశ్విన్‌, అలీ మామా అల్లుళ్లుగా క‌నిపిస్తూ సందడి చేస్తారు. అజ‌య్‌ ఘోష్‌, ఊర్శశి పాత్రలు సెకండ్ హాఫ్‌లో క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. బురిడీ బాబాల్ని పోలిన వాళ్ల అవ‌తారం, దెయ్యాల్ని చూసి భ‌య‌ప‌డే తీరుతో న‌వ్వులు బాగా పండాయి. ధ‌న్‌రాజ్‌, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ, హ‌రితేజ, శివ‌శంక‌ర్ మాస్టర్ పాత్రల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. మిగతా నటీనటులు పాత్రల పరిధిమేర నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే : ఓంకార్.. రాజుగారి గది2 సినిమా కంటే మించి ఈసినిమా ఉంటుంది అని చెప్పడంతో.. ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియన్స్‌‌కు ఓ రొటీన్ స్టోరీతో కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథనంలో ఇంకొద్దిగా కేర్ తీసుకున్నట్టయితే బాగుండు అనిపిస్తుంది. అతను రాసుకున్న లైన్‌ను తెరమీద చూపించడంలో తడబడ్డాడు అనే చెప్పాలి. పూర్తిగా తన తమ్ముడు అశ్విన్‌ను మాస్ హీరోగా ప్రజెంట్ చేసేందుకు ఎక్కువ దృష్టి పెట్టాడు అనిపిస్తుంది. 
ఇలాంటి కామెడీ హారర్ సినిమాలకు సంగీతం ప్రాణం లాంటింది. ఈ సినిమాకు షబ్బీర్ అందించిన మ్యూజిక్ ఓ మోస్తరుగా ఉండి ఫీల్ మిస్సయినట్టు అనిపించింది. ఆర్ఆర్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది.  సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పనితనం  ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రతి సన్నివేశాన్ని కూడా తనదైన ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు. బుర్ర సాయి మాధవ్ డైలాగ్స్ తన స్థాయికి తగ్గట్టుగా ఆకట్టుకోలేకపోయాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 
ఓవరాల్‌గా చెప్పాలంటే :  రాజుగారి గది 3 మూవీ గురించి చెప్పాలంటే బ్రాండ్ నేమ్‌తో పాటు మాస్ కామెడీ కూడా కాస్త కలిసొచ్చి… బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా గట్టెక్కే అవకాశం ఉంది. ఏస్థాయిలో వసూలు చేస్తుందో తెలియాలి అంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాలి.. 

ప్లస్ పాయింట్ 
నటీనటులు 
కామెడీ 
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
డైలాగ్స్ 
మ్యూజిక్
ఆసక్తి కరంగాలేని సన్నివేశాలు