హే CBN..వేరీజ్‌ డెమోక్రసీ : నిర్భందంపై రాంగోపాల్ వర్మ ఫైర్

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 01:24 AM IST
హే CBN..వేరీజ్‌ డెమోక్రసీ : నిర్భందంపై రాంగోపాల్ వర్మ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. RGVతో పాటు చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను తిరిగి పోలీసులు ఎయిర్‌పోర్టుకు పంపేశారు. దీంతో పోలీసుల తీరుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా డెమోక్రసీ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. 

రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో సినిమా తీశారు. ఈ చిత్రానికి ఏపీలో బ్రేక్‌ పడింది. మే 1న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలు చెప్పడానికి ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు RGV ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఉంటుందని ప్రకటించారు. తర్వాత దాన్ని హోటల్ ఐలాపురానికి మార్చారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో  అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ ప్రకటించారు. చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డితో కలిసి రాంగోపాల్‌ వర్మ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే పోలీసులు ఇద్దరినీ అడ్డుకున్నారు. అయినా కారులో పైపులరోడ్డుకు బయలుదేరారు. ఈ  సమాచారాన్ని విమానాశ్రయ పోలీసులు సిటీ పోలీసులకు చేరవేశారు.

RGV, చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డిని రామవరప్పాడు రింగ్‌రోడ్డు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి ఇద్దరినీ దింపేశారు. ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లాలని కోరారు. అయితే ఇందుకు వారు ససేమిరా ఒప్పుకోలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి తీరుతానని పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో ఇద్దరినీ పోలీసులు బలవంతంగా మరో కారులో  విమానాశ్రయానికి పంపేశారు. విమానాశ్రయం లాంజ్‌లో ఇద్దరినీ నిర్బంధించారు.  అక్కడి నుంచి వర్మ ఓ వీడియో విడుదల చేశారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విశేషాలు చెప్పడానికి వచ్చానని.. పోలీసులు బలవంతంగా తనను, నిర్మాతను కారు దింపేసి, ఎయిర్‌పోర్టులో పడేశారని చెప్పారు. తాము విజయవాడలో ఉండటానికి వీల్లేదని చెబుతున్నారని… ఇదెక్కడి  విచిత్రమో అంటూ ఫైర్‌ అయ్యారు. ట్విట్టర్‌లో ఏపీ పోలీసుల తీరును RGV ప్రశ్నించారు. తన ప్రెస్‌ మీట్‌ రద్దు అయినట్టు వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు. తనను బలవంతంగా నిర్బంధించారని, దాంతో తాను తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయినట్టు తెలిపారు. హే సీబీఎన్‌.. వేరీజ్‌ డెమోక్రసీ అంటూ ట్విట్టర్‌లో సూటిగా ప్రశ్నించారు.

మరోవైపు బెజవాడలో ఎన్నికల కోడ్‌తోపాటు సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నాయని పోలీసులు వివరణ ఇచ్చారు. వర్మ ఈ సమావేశంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ప్రశాంత వాతావరణం చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ఆయనను హైదరాబాద్‌ పంపించామని స్పష్టం చేశారు.