మద్యం షాపులు తెరవండి మహాప్రభో.. రిషి కపూర్ విజ్ఞప్తి

కరోనా ఎఫెక్ట్ : మద్యం షాపులు తెరవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రిషి కపూర్ విజ్ఞప్తి..

  • Published By: sekhar ,Published On : March 28, 2020 / 04:13 PM IST
మద్యం షాపులు తెరవండి మహాప్రభో.. రిషి కపూర్ విజ్ఞప్తి

కరోనా ఎఫెక్ట్ : మద్యం షాపులు తెరవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రిషి కపూర్ విజ్ఞప్తి..

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఇక మందు బాబుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతం.. ముందుగా తెలిస్తే స్టాక్ పెట్టుకునే వాళ్లం కదా అని ఆవేదన చెందుతున్నారు. కొందరు గజతాగుబోతులైతే బ్రాండ్ ఏదైనా పర్లేదు గుక్కెడు బ్రాందీ దొరికితే చాలు అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ పరిస్థితిలో డబ్బులున్నోడికంటే మందు స్టాక్ ఉన్నోడే గొప్ప అన్నట్టు ఫీలయిపోతున్నారు.

తాజాగా మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ చేసిన ట్వీట్ సోషల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమని ట్వీటారంటే.. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డ‌బ్బు అవ‌స‌రం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మ‌ద్యం దుకాణాల‌ని సాయంత్రం స‌మ‌యంలో తెర‌వాలి. ఈ విష‌యంలో న‌న్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక నెటిజన్లు తమ రిప్లైలతో రెచ్చిపోయారు..

నిత్యావసర వస్తవులు దొరక్క ఇబ్బంది పడుతుంటే మందు కావాలా.. మీ డబ్బున్నోళ్లున్నారే.. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తారు.. ఫుల్లుగా మందేసి ఆడాళ్ల మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి.. ఈ విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్ ప్రాముఖ్యత తెలియజేయాల్సింది పోయి మందు గోలేంటండీ బాబు.. అంటూ రిషిని ఓ ఆటాడుకుంటున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించాడు కాబట్టే ‘ఈ విష‌యంలో న‌న్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు’ అని ముందే చెప్పాడాయన. గతంలోనూ ఆయుధపూజ అంటూ బీర్ బాటిల్, ఓపెనర్ ఫోటో పోస్ట్ చేసి చీవాట్లు తిన్నాడు రిషి కపూర్.