అప్పుడు అజ్ఞాతవాసి, ఇప్పుడు సాహో : తెలుగు దర్శకులకు కాపీ కొట్టడం కూడా చేతకాదా

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 03:54 PM IST
అప్పుడు అజ్ఞాతవాసి, ఇప్పుడు సాహో : తెలుగు దర్శకులకు కాపీ కొట్టడం కూడా చేతకాదా

అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ పరువు పోయింది. తెలుగు డైరెక్టర్లకు కాపీ కొట్టడం కూడా చేతకాదా అని అడుగుతున్నారు. కాపీ కొట్టినా.. మరీ ఇంత చెత్తగా సినిమాలు తీస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సల్లో ‘సాహో’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాహోని చెత్తగా తీశారని మండిపడ్డాడు. సాహో తనకు నచ్చలేదని తెలిపాడు. తన సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారని, కానీ దాన్ని సక్రమంగా తెరకెక్కించలేదని.. కాస్త చూసుకుని రీమేక్ లు చేయాలని సలహా ఇచ్చాడు.

‘నా సినిమాను ముందు ‘అజ్ఞాతవాసి’గా రీమేక్ చేసి చెడగొట్టారు. అది చాలదన్నట్టు ఇప్పుడు నా సినిమాను ప్రేరణగా తీసుకుని ‘సాహో’ని తీశారు. ఆ సినిమా చూశాను. ఈ మూవీ ‘అజ్ఞాతవాసి’ కంటే వరస్ట్‌గా ఉంది. కాపీ సీన్స్‌ను తెరకెక్కించేటపుడు కాస్తంత చూసుకుని తెరకెక్కిస్తే బాగుంటుంది. వీళ్లకు దొంగతనం కూడా చేతకాలేదు’ అని జెరోమ్ ఘాటుగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో ఆగస్టు 30న విడుదలైంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.

గతంలో పెద్ద టెక్నాలజీ ఉండేది కాదు. దీంతో ఫ్రెంచ్, కొరియన్, ఇరాన్, జపనీస్ ఇలా ఏ భాషా సినిమాలనైనా దర్శకులు కాపీ కొట్టినా తెలిసేది కాదు. కానీ, ఇప్పుడలా కాదు. ప్రపంచ సినిమాల్లో ఏం పాయింట్ దొరుకుతుందా అని మన దర్శక రచయితలు ఎలా చూస్తారో.. వాళ్లు కూడా ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో అని ఓ కన్ను వేసి ఉంచుతున్నారు. దీంతో ఫ్రీమేక్ పేరిట మక్కీ కి మక్కీ కాపీ కొట్టేస్తున్న కాపీ రాయుళ్లు ఇట్టే దొరికిపోతున్నారు. తమ సినిమాను కాపీ కొట్టిందే కాక తమకు క్రెడిట్స్ ఇవ్వకుండా, అదేదో తమదే క్రియేటివిటీ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పోనీ, కాపీ కొట్టినా సినిమాను బాగా తీశారా అంటే అదీ లేదని.. నాశనం చేస్తున్నారని హాలీవుడ్ దర్శకులు మండిపడుతున్నారు.