తేజ్ పిలుపునిచ్చాడు.. ఫ్యాన్స్ పాటిస్తున్నారు..

  • Published By: sekhar ,Published On : October 14, 2020 / 01:43 AM IST
తేజ్ పిలుపునిచ్చాడు.. ఫ్యాన్స్ పాటిస్తున్నారు..

Sai Dharam Tej: తమ అభిమాన హీరో పుట్టినరోజంటే వీరాభిమానుల ఫ్లెక్సీలు, కేక్ కటింగులు, బైక్ ర్యాలీలు.. మాములు హడావిడి చేయరు. అయితే తమ అభిమాన హీరో పిలుపును గౌరవించి అనవసరపు ఆర్భాటాలకు పోకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మిగతా అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.

Sai Dharam Tej

అక్టోబర్ 15 సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అభిమానులు అక్టోబర్ 13,14,15 మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

ముందుగా ఏలూరు వన్ టౌన్ మార్కెట్ ఏరియాలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సాయి తేజ్ పేరున ప్రత్యేక పూజలు చేయించిన ఫ్యాన్స్… మెగా రక్తదాన శివిరంతో పాటు HIV బాధితులకు నిత్యావసరవస్తువుల పంపిణి, థియేటర్ల సిబ్బందికి బియ్యం, కూరగాయల పంపిణి, వలస కార్మికులకు అల్పాహార వితరణ, చిన్నపిల్లల బ్లైండ్ స్కూల్‌లో పళ్లు పంపిణి, అమ్మా నాన్న వికలాంగుల సంస్థకు అలాగే వృద్ధాశ్రమంలో భోజనాల కార్యక్రమం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ తమ అభిమాన కథానాయకుడి పిలుపు మేరకు చేతనైనంతలో నలుగురికి సాయమందిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Sai Dharam Tej

గతేడాది విజయవాడకు చెందిన అమ్మ ఆదరణ సేవా వృద్ధాశ్రమం వారు తమ ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి సాయం చేయాలని సాయి ధరమ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో 2019 అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజు నాడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులకు ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించగా వారందరూ బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్ వంటివి చేయకుండా ఆ డబ్బుతో తమవంతు సాయమందించారు.

Sai Dharam Tej

అలాగే బిల్డింగ్ పూర్తి చేయడంతో పాటు ఒక సంవత్సరం వరకు ఆ ఓల్డేజ్ హోమ్‌కు తను స్పాన్సర్ షిప్ అందిస్తున్నట్లు తెలియచేశాడు సాయి..
చెప్పినట్లుగానే సంవత్సరం కల్లా అమ్మ ఆదరణ సేవా వృద్ధాశ్రమం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. ఏ దిక్కూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించిన సాయి ధరమ్ తేజ్‌కు ఓల్డేజ్ హోమ్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, మెగాభిమానులు, నెటిజన్లు సాయి ధరమ్ తేజ్‌ను అభినందిస్తున్నారు.