Sandalwood Drug Case: భార్యతో సహా విచారణకు హాజరైన కన్నడ స్టార్ హీరో..

  • Published By: sekhar ,Published On : September 16, 2020 / 05:46 PM IST
Sandalwood Drug Case: భార్యతో సహా విచారణకు హాజరైన కన్నడ స్టార్ హీరో..

Sandalwood drug case: డ్రగ్స్ కేసు.. కన్నడ చిత్రపరిశ్రమను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాగిణి ద్వివేది, సంజన గల్రాని అరెస్టు అయ్యారు. న్యాయస్థానం వారిని 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం వారు బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటున్నారు.

తాజాగా శాండల్‌వుడ్ స్టార్ హీరో దిగంత్ పేరు వెలుగులోకి వచ్చింది. దిగంత్.. ఆయన భార్య, నటి ఐంద్రితా రాయ్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.


దిగంత్.. కన్నడలో పలు హిల్ సినిమాల్లో నటించారు. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘వాన’ మూవీ ద్వారా హీరోగా తెలుగుతెరకు పరిచయం అయ్యారు. మరో డబ్బింగ్ మూవీ ‘నాగాభరణం’లో హీరోగా నటించారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి ఇప్పటికే నోటీసులను అందుకున్న వారిద్దరూ.. విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కిందట సీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు.


ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కొందరు డ్రగ్ పెడ్లర్ రాహుల్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించిన సందర్భంగా దిగంత్ ఆయన భార్య ఐంద్రితా రాయ్‌ల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో వారిద్దరినీ విచారణకు పిలిపించారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.
రాగిణి, సంజన, డ్రగ్ పెడ్లర్ రాహుల్, ప్రశాంత్‌ రాంకా అరెస్టయిన వారిలో ఉన్నారు. కర్ణాటక మాజీమంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా సీసీబీ పోలీసుల నుంచి నోటీసులను అందుకున్నారు. వారిలో సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు.


రాగిణి, సంజన ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు మరి కొందరు ప్రముఖులకు నోటీసులను అందించే అవకాశాలు ఉన్నాయి. దిగంత్, ఐంద్రితా రాయ్‌ల విచారణ సందర్భంగా మరిన్ని పేర్లు వెలుగులోకి రావొచ్చని భావిస్తున్నారు.


ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల వారసులు, టాప్ ఇండస్ట్రీయలిస్ట్ కుటుంబాల వ్యక్తులూ ఉండొచ్చని చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఫామ్‌హౌస్‌లో తరచూ డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తుండేవాళ్లమని రాహుల్ వెల్లడించినట్లు ఇదివరకే వెల్లడైంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ డ్రగ్స్ పార్టీలకు తరచూగా హాజరయ్యే వారి పేర్లతో కూడిన జాబితాను సీసీబీ అధికారులు తయారు చేస్తున్నారు.


మరోవైపు డ్రగ్స్ కేసులో రాజకీయ ప్రముఖుల పేర్లు కూడా ఉండటం పట్ల దర్యాప్తు నెమ్మదించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసు విషయంలో తాము ఎలాంటి రాజీపడబోమని, దర్యాప్తును వేగవంతం చేస్తామంటూ కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఎలాంటి వారైనా వదలబోమనీ చెప్పారు.