కలియుగ ‘బ్రహ్మ’ వర్మ- కరోనా గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడు..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడనే వార్త వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : April 4, 2020 / 01:15 PM IST
కలియుగ ‘బ్రహ్మ’ వర్మ- కరోనా గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడు..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడనే వార్త వైరల్ అవుతోంది..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ రెండేళ్ల క్రితమే చెప్పాడు.. తలరాత విషయంలో బ్రహ్మదేవుడిని తలుచుకుంటే, సినిమా విషయంలో మాత్రం ఆర్జీవీ బ్రహ్మ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో వర్మని తెగ పొగిడేస్తున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. 
కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసి 2 లేదా 3 నెలలు మాత్రమే అవుతుంది. కానీ సంచలన దర్శకుడు వర్మకు మాత్రం 2018లోనే దీని గురించి తెలిసిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ.. 2018లో వర్మ ప్రకటించిన ‘వైరస్’ చిత్ర కథకి దగ్గరగా.. మక్కీకి మక్కీ ఒకేలా ఉండటం విశేషం.

2018లో వర్మ ‘వైరస్’ అనే పేరుతో ఓ మూవీ అనౌన్స్ చేశాడు. ‘సర్కార్’, ‘26/11 ది ఎటాక్’ చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మిస్తున్నార‌ని, పూర్తి వివ‌రాల కోసం ఫేస్‌బుక్ లింక్‌ని క్లిక్ చేయండని 10/6/2018న వర్మ ఓ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్‌ను మళ్లీ వర్మ ఇప్పుడు ట్వీట్ చేసి.. రెండు సంవత్సరాల క్రితం నేను ప్రకటించిన ‘వైరస్’ చిత్రానికి, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌కు ఎన్నో పోలికలు ఉన్నాయి. కావాలంటే చూడండి.. అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Read Also : ప్రధాని పిలుపుకు సెలబ్రిటీల సంఘీభావం.. ఏమన్నారంటే..

అసలు వర్మ ‘వైరస్’ కథ విషయానికొస్తే.. ‘‘ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన ఓ వ్యక్తి.. అక్కడి నుంచి ఓ వైరస్‌ను అంటించుకుని ముంబై వస్తాడు. ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే అతని నుంచి మరికొందరికి వ్యాపిస్తుంది. ప్రభుత్వం అప్రమత్తమై.. మనిషికీ మనిషికీ మధ్య 20 అడుగుల దూరం ఉండాలని సూచిస్తుంది. ఈ వైరస్ దెబ్బకి దాదాపు లక్షకు పైగా జనాలు చనిపోతారు. రవాణా వ్యవస్థ స్థంబించిపోతుంది. ముంబై నుంచి ప్రజలు పారిపోవాలని చూస్తారు. ఈ వైరస్‌ను ముంబై నుంచి వ్యాప్తి చేయాలని చూసే వారిని కాల్చి వేయండి అని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది..’’.. ఇదే వర్మ చెప్పిన ‘వైరస్’ కథ. దాదాపు కరోనా విషయంలో కూడా ఇప్పుడదే జరుగుతుంది. అందుకే 2018లో వర్మ చేసిన ఈ పోస్ట్ చూసిన వారంతా నువ్వు కాలజ్ఞానం తెలిసిన కలియుగ ‘బ్రహ్మ’వి స్వామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.