సింగర్ కనికా కపూర్‌పై కేసు నమోదు : ఏకాంతంలో ప్రముఖులు

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 04:13 AM IST
సింగర్ కనికా కపూర్‌పై కేసు నమోదు : ఏకాంతంలో ప్రముఖులు

బాలీవుడ్ సింగర్‌ కనికా కపూర్‌కు మరో షాక్‌ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ  పోలీసులు కేసు పెట్టారు. లక్నో చీఫ్‌ మెడికల్ ఫిర్యాదుతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కనికా కపూర్.. ఇప్పుడు ఈ పేరు ప్రముఖులకు సైతం హడల్ పుట్టిస్తోంది. దేశ విదేశాల్లో తన కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌.. కరోనాను తీసుకొచ్చి కొంప ముంచింది. ఆమెకు కరోనా  పాజిటివ్‌ రిపోర్ట్ రావడంతో.. ఏకంగా ఎంపీలు సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ నెల 9న బ్రిటన్‌ నుంచి ముంబయి చేరుకున్న కనికాకు.. అక్కడ పరీక్షల్లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. లఖ్‌నవూలో ఉండగా ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారు.. ఆమె కార్యక్రమాలకు వెళ్లిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా వారంతా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

కనికాకు కరోనా సోకినట్లు ధ్రువీకరించడంతో కలకలం చెలరేగింది. ఈనెల 13 నుంచి 15 వరకూ కనికా కపూర్‌ కొన్ని పార్టీలు, కార్యక్రమాలకు హాజరైందని.. ఆయా కార్యక్రమాలకు సుమారు 300 మంది చొప్పున హాజరై  ఉండవచ్చని తెలుస్తోంది. ఆమె పాల్గొన్న విందు కార్యక్రమాలకు వెళ్లిన ప్రముఖులు.. ఆ తర్వాత పరోక్షంగా వారికి చేరువగా గడిపిన మరికొంత మంది ముందు జాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు.

కొంతమంది ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు. కనిక ఇటీవల లఖ్‌నవూ, కాన్పుర్‌లో జరిగిన కొన్ని కుటుంబ వేడుకలు, విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లఖ్‌నవూలో కనిక హాజరయిన విందుకు రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర  రాజె, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్‌ వెళ్లారు. ఇప్పుడు కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వసుంధర రాజే, దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. 

కనిక కరోనా ఎఫెక్ట్ పార్లమెంట్ వరకు పాకింది. కనికా కపూర్ విందుకు హాజరైన వసుంధరారాజే తనయుడు, ఎంపీ దుష్యంత్ … ఆ పార్టీ నుంచి నేరుగా పార్లమెంటుకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు  పార్లమెంటులోనే గడిపారు. దుష్యంత్‌ పార్లమెంట్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్‌తో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారివురు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకుంటున్నట్లు ప్రకటించారు.

మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ఓ విందుకు పలువురు ఎంపీలతో పాటు దుష్యంత్‌ కూడా హాజరయ్యారని.. బుధవారం రవాణా, సాంస్కృతిక శాఖలు నిర్వహించిన సమావేశంలోనూ దుష్యంత్‌ 20 మంది  ఎంపీలతో కలిసి ఉన్నారని డెరెక్‌ వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని ఆయన కోరారు. 

కనికా కపూర్‌ తీరుతో రాష్ట్రపతి కోవింద్ సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనికా ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీ దుష్యంత్.. ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఆ సందర్భంగా దుష్యంత్ రాష్ట్రపతి కోవింద్‌ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. దీంతో.. ఇప్పటివరకు ఫిక్స్ అయిన అన్ని అపాయింట్‌మెంట్స్‌, షెడ్యూల్స్ ఆయన రద్దు చేసుకున్నారు. 

See Also | సింగర్ కనికా ఎఫెక్ట్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కరోనా పరీక్షలు..?

కనికా కపూర్ ఇచ్చిన విందుకు రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె తనయుడు కూడా హాజరవడం.. ప్రస్తుతం వారు స్వియ నిర్బంధంలో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కనికా ఇచ్చిన విందుకు  హాజరైన వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతో వారిలోను ఆందోళన మొదలైంది. అయితే.. లండన్ నుంచి వచ్చాక ఎయిర్ పోర్టులో తనకు అందరి మాదిరే పరీక్షలను నిర్వహించారని అప్పుడు ఏమీ లేదని  కనికా చెబుతోంది.

వారం రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభమైందని.. 4 రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనపడటంతో తనకు తాను పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలిందని  వెల్లడించింది. ప్రస్తుతం తాను, తన కుటుంబసభ్యులు క్వారంటైన్‌లో ఉన్నామని తెలిపింది. 

Read More : ఇండియాలో కరోనా @ 258 కేసులు