‘పలాస 1978’ దళితుల సినిమా – ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిదే : తమ్మారెడ్డి భరద్వాజ

‘పలాస 1978’ థ్యాంక్స్ మీట్- దళితుల గొప్పదనం తెలిపే సినిమా ఇదని ప్రశంసించిన తమ్మారెడ్డి..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 02:57 PM IST
‘పలాస 1978’ దళితుల సినిమా – ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిదే : తమ్మారెడ్డి భరద్వాజ

‘పలాస 1978’ థ్యాంక్స్ మీట్- దళితుల గొప్పదనం తెలిపే సినిమా ఇదని ప్రశంసించిన తమ్మారెడ్డి..

రక్షిత్, నక్షత్ర జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ : ‘‘ఒక మంచి సినిమా కావాలి అంటారు.. మంచి రివ్యూ లు కావాలి అంటారు.. అవన్నీ ఉన్న సినిమా ‘పలాస 1978’. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాలుగా మారవు అంటారు.. కానీ పలాసలో వారి పాత్రలను హీరోలను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు కూడా మీరు చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే.. మరిన్ని సినిమాలు వస్తాయి.. ఇది నా వేదన. ఆవేదన..

నా నలభై ఏళ్ల కెరీర్‌లో ఏ సినిమా ఆడినా, ఆడకపోయినా బాధ పడలేదు.. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం.. ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే. పలాస సినిమా విడుదలైన తరువాత అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన సినిమాల్లో పలాస ఒకటి.

ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది, మళ్లీ ఈ సినిమాను విడుదల రోజు థియేటర్‌లో చూశాను, నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. దీనంతటికి కారణం దర్శకుడు కరుణ కుమార్, తను ప్రాణం పెట్టి ఈ సినిమా తీసాడు, తన కష్టం వృధా కాదని భావిస్తున్నాను. నా 40 ఏళ్ల కెరీర్‌లో ఇంత బాగా ప్రతి డైలాగ్, సన్నివేశం నాకు గుర్తుండిపోయే సినిమా పలాస అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘పలాస 1978’ నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.