‘తాండవ్‌’ వివాదం, నాలుక కత్తిరిస్తే కోటి నజరానా

‘తాండవ్‌’ వివాదం, నాలుక కత్తిరిస్తే కోటి నజరానా

tandav

Tandav : వెబ్ సిరీస్ తాండవ్ ని రోజుకో వివాదం చుట్టుముడుతుంది. ఈ వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కత్తిరిస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తామని కర్ణిసేన ప్రకటించింది. ఈ మేరకు కర్ణిసేన చీఫ్‌ అజయ్‌ సెంగార్‌ సంచలన ప్రకటన చేశారు. తాండవ్‌ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది మొదలు రోజుకో వివాదం జరుగుతోంది.

ఈ వెబ్‌ సీరీస్‌లో దేవుళ్లు, దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను గాయపరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ‘తాండవ్’ యూనిట్ క్షమాపణలు చెప్పింది. వివాదాస్పద సీన్లను తొలగించనున్నట్టు ప్రకటించింది. దీంతో వివాదం సమసిపోతుందని అంతా భావించారు.

ఇంతలో హిందూ దేవుళ్లను అవమానించిన వారి నాలుక కోస్తే కోటి రూపాయల నజరానా అంటూ కర్ణిసేన సంచలన ప్రకటన చేసింది. తాండవ్‌ దర్శక నిర్మాతలు చెప్పిన క్షమాపణలను తాము అంగీకరించమని తెలిపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ వెబ్‌ సిరీస్‌ యూనిట్‌లో కీలక వ్యక్తులపై లక్నో కేసు నమోదు అయ్యింది.

తాజాగా, ముంబైలోని ఘట్కోపర్‌లో మరో కేసు నమోదైంది. అటు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు తాండవ్‌ సిరీస్‌ మీద శివాలెత్తుతున్నారు. హిందూ దేవుళ్లను ఎగతాళి చేశారని మండిపడుతున్నారు. తాండవ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తాండవ్, బ్యాన్ తాండవ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా వైరల్ చేస్తున్నారు.