Theatres Close : రాష్ట్రంలో సినిమా థియేట‌ర్ల మూసివేత, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి థియేటర్లు మూసివేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

Theatres Close : రాష్ట్రంలో సినిమా థియేట‌ర్ల మూసివేత, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Theatres Close

Theatres Close : మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి థియేటర్లు మూసివేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. క‌రోనా కేసుల తీవ్ర‌త నేప‌థ్యంలో తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఖండించారు.

రాష్ట్రంలో సినిమా థియేట‌ర్ల‌ను మూసివేయ‌డం లేద‌ని మంత్రి తేల్చిచెప్పారు. థియేట‌ర్లు మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దని సూచించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌తో సినిమా థియేట‌ర్లు య‌థాత‌థంగా న‌డుస్తాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. థియేట‌ర్ల‌కు వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, విధిగా మాస్కు ధ‌రించి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని మంత్రి త‌ల‌సాని విజ్ఞ‌ప్తి చేశారు.

‘కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీనే నమ్ముకున్న ఎంతోమంది చిన్న నటీనటులు, కార్మికులు రోడ్డునపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. కొవిడ్‌-19 నిబంధనలను అనుసరిస్తూ ఎలా అయితే సినిమా హాళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయో అలాగే కొనసాగుతాయి. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి’’ అని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.

గత ఏడాది(2020) కరోనా వైరస్ భారీ నష్టాన్నే మిగిల్చింది. మరీ ముఖ్యంగా వినోద రంగంపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్నే చూపింది. మన దేశంలోని సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌లు చాలాకాలం మూతపడ్డాయి. అనేక సినిమాల విడుదల వాయిదా పడింది. ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. ఆ తర్వాత కరోనా తీవ్రత అదుపులోకి రావడంతో గతేడాది డిసెంబర్‌లో థియేటర్లను పున: ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం వంద శాతం సీటింగ్‌కు కూడా అనుమతి ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం.. ప్రత్యేక గైడ్ లైన్స్‌తో గత(2020) డిసెంబర్‌ నుంచి 50శాతం సీటింగ్‌తో.. ఈ ఏడాది(2021) ఫిబ్రవరి నుంచి 100శాతం ఆక్యుపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు నడుస్తున్నాయి. సింగిల్ స్క్రీన్‌లతో పాటు మల్టీ ప్లెక్స్ లలో కూడా కోవిడ్ నిబంధనలు అనుసరిస్తున్నారు. అయితే, కరోనా కేసులు మళ్లీ పెరగడంతో తెలంగాణలోని థియేటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. థియేటర్లను మరోసారి మూసివేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు.. వీలైతే సినిమా హాళ్లను పూర్తిగా మూసివేయాలని లేకుంటే 50శాతం ఆక్యుపెన్సీతో నడిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి మంత్రి తలసాని ఫుల్ స్టాప్ పెట్టారు.