తోలుబోమ్మలాట – రివ్యూ

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం.. ‘తోలుబొమ్మలాట’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : November 22, 2019 / 10:38 AM IST
తోలుబోమ్మలాట – రివ్యూ

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం.. ‘తోలుబొమ్మలాట’ రివ్యూ..

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ కథా చిత్రం.. ‘తోలుబొమ్మలాట’.. ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మించగా.. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది.. ‘మేం మా కుటుంబంతో వస్తున్నాం.. మీరూ మీ కుటుంబంతో సినిమాకి రండి’ అని ఆహ్వానించిన టీమ్ ‘తోలుబొమ్మలాట’ తో ప్రేక్షకులను అలరించిందా, లేదా చూద్దాం.. 

కథ విషయానికి వస్తే :
అచ్యుతాపురం అనే గ్రామంలో సోమరాజును అందరూ సోడాల రాజు అని పిలుస్తూ ఉంటారు. ఆయన తన రైస్ మిల్లును నడుపుకుంటూ ఉంటాడు. ఆయన మనవడు రిషి , మనవరాలు వర్ష ప్రేమించికుంటున్నామని, తమకు పెళ్లి చేయమని అడుగుతారు. వారిద్దరికి పెళ్లి చేయాలనేది తన చివరి కోరికగా పెట్టుకుంటాడు. దాని కోసం ఓ నాటకం ఆడుతాడు.. ఇంటికి వచ్చిన ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకుంటాయి. అయితే సంతోషంగా ఉన్న సోమరాజు హఠాత్తుగా మరణిస్తాడు. ఇక అప్పటి నుంచి పరిణామాలు మారుతూ ఉంటాయి. ఆత్మగా మారిన సోమరాజు.. మనవడు,మనవరాలి పెళ్లి చేయగలిగాడా.. లేదా అనేది తెరపై చూడాలి. 

Read Also : ‘జార్జ్ రెడ్డి’ – రివ్యూ

నటీనటుల విషయానికి వస్తే :
ఈ మూవీలో ముందుగా చెప్పుకోవాల్సింది సోమరాజుగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గురించే. ప్రతీ సీన్‌లో తన మార్క్ చూపించేశాడు. కన్నీటిని పెట్టించే సీన్స్‌లోనే కాకుండా ప్రతీ సన్నివేశంలో తన అనుభవాన్ని చూపించాడు. ఇక తరువాత చెప్పుకోవాల్సింది సంతోష్ పాత్రను పోషించిన వెన్నెల కిషోర్ గురించి. స్క్రీన్‌పై కనిపించిన మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు నవ్విస్తూనే ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కాంబోలో వచ్చిన ప్రతీ సీన్ బాగా వర్కౌట్ అయింది. ఇక రిషి, వర్ష పాత్రల్లో నటించిన విశ్వాంత్, హర్షిత పర్వాలేదనిపించారు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే :
దర్శకుడిగా మొదటి సినిమా అయినా.. బలమైన కథను తీసుకోవడంలో అతని గట్స్ కనిపిస్తాయి. అయితే ఎంచుకున్న ఈ కథను చెప్పడానికి రాసుకున్న కథనం మాత్రం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. అయితే సన్నివేశాలకు తగ్గట్టు రాసిన మాటల్లో అతని రచన శైలి మెప్పిస్తుంది. సురేష్ బొబ్బలి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మాటలు రాసిన విశ్వనాథ్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాడు. సతీష్ కెమెరా పనితనం, కోటగిరి ఎడిటింగ్ ఇలా ప్రతీ విభాగం సినిమాను అందంగా మలిచేలా చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.. 

ఫైనల్‌‌గా చెప్పాలంటే :
 హీరోయిజం, మాస్ డైలాగ్‌లు, కొడితే పది మంది పడిపోయే లాంటి అంశాలను ఆశించే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదేమో గానీ మంచి ఫీల్ గుడ్ మూవీస్‌ను ప్రేమించేవారికి నచ్చే చిత్రంగా ‘తోలుబొమ్మలాట’ మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కమర్షియల్‌గా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.