విజయ్ చందర్‌కు కీలక పదవి: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

  • Edited By: vamsi , November 11, 2019 / 11:34 AM IST
విజయ్ చందర్‌కు కీలక పదవి: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పాదయాత్ర సమయంలో జగన్‌కు మద్దతుగా రంగంలోకి దిగి తనతో కలిసి నడిచిన వెటరన్ నటుడు తెలిదేవర విజయ్ చందర్‌కు కీలక పదవి ఇచ్చారు. పార్టీలో మొదటి నుంచి తనతో ఉన్న వారికి పదవుల కేటాయింపులో వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్.

ఈ క్రమంలోనే పృధ్వీకి ఎస్వీబీసీ ఛైర్మన్‌గా, లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమి ఛైర్మన్ పదవి కట్టబెట్టిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పదవిని తెలిదేవర విజయ్ చందర్‌కు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను కూడా విడుదల చేసింది.

ఈ పదవికి సంబంధించి  పోసాని, మోహన్ బాబు, ఆలీ, జయసుధ, భాను చందర్ వంటి పేర్లు ప్రచారం జరిగిన చివరకు మాత్రం పదవి విజయ్ చందర్‌కి దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు విజయ్ చందర్.. విజయ్ చందర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా ఆప్తులు. సాయిబాబాగా.. కరుణామయుడుగా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్ జగన్ పార్టీ ప్రకటన నాటి నుండి ఆయనతోనే ఉండగా.. ఇప్పుడు ఆయనకు పదవి ఇచ్చారు జగన్.

జగన్ జైలులో ఉన్న సమయంలోనూ.. షర్మిళ పాదయాత్ర వేళ.. ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా పని చేసారు విజయ్ చందర్. జగన్ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలా హాజరై.. జగన్ పట్ల తన విధేయత చాటుకోగా ఇప్పుడు ఆయనకు కీలక పదవి దక్కింది.