Vikram: రెండు పార్టుల క్రేజ్.. పుష్పకు తోడుగా ధృవ నక్షత్రం!

Vikram: రెండు పార్టుల క్రేజ్.. పుష్పకు తోడుగా ధృవ నక్షత్రం!

Vikram

Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నిఖార్సయిన హిట్టుకొట్టి దశాబ్దకాలం గడిచిపోయింది. అపుడెపుడో శంకర్ అపరిచితుడే ఇప్పటికీ విక్రమ్ కు చెప్పుకోదగ్గ భారీ సక్సెస్. ఆ స్థాయి విజయం కోసం విక్రమ్ చాలా ఏళ్లుగా పోరాటం చేస్తుండగా.. చివరికి మళ్ళీ ఆ శంకర్ కూడా ఐ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కించాలని చూసినా నెరవేరలేదు. దీంతో విక్రమ్ ఇప్పుడు ఆశలన్నీ గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ధృవ నక్షత్రం పైనే పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లే గౌతమ్ మీనన్ హాలీవుడ్ రేంజ్‌లో గత రెండేళ్లుగా ఈ సినిమాను చెక్కుతున్నారు.

కాగా.. ఇప్పుడు విక్రమ్ ధృవ నక్షత్రం కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. బాహుబలి రెండు భాగాల క్రేజ్ తో ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలు అదే బాటలో వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ పుష్ప రెండు భాగాలుగా తీసుకురావాలని సన్నాహాలు జరుగుతుండగా ఇప్పుడు అదే బాటలో విక్రమ్ ధృవ నక్షత్రం కూడా తీసుకురానున్నారని తెలుస్తుంది.

ఇక, ఇప్పటికే విడుదలైన టీజర్‌లు సినిమా మీద భారీ అంచనాలను పెంచేయగా సినిమా అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన విజువల్ వండర్‌గా కానుందని అర్ధమవుతుంది. ఇందులో విక్రమ్ అండర్ కవర్ ఏజెంట్‌గా కనిపించబోతుండగా ఫారిన్‌లో తెరకెక్కించిన ప్రతి సన్నివేశం సినిమాలో హైలెట్ కానుందని చెప్తున్నారు. విక్రమ్ సరసన ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మ జోడీ కడుతుండగా ఐశ్వర్య రాజేశ్, సిమ్రన్‌, రాధిక, దివ్యదర్శిణి ముఖ్య పాత్ర పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.