సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీపై రాజ‌కీయం న‌డుస్తోందా..?

  • Published By: sreehari ,Published On : August 7, 2020 / 07:49 PM IST
సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీపై రాజ‌కీయం న‌డుస్తోందా..?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీపై రాజ‌కీయం న‌డుస్తోందా..? ఆయ‌న మ‌ర‌ణంపై సీబీఐ ద‌ర్యాప్తు రాష్ట్రాన్ని శాసించే దిశ‌గా అడుగులు వేస్తోందా..? ఓ వైపు క‌రోనా మ‌రోవైపు వ‌ర‌ద‌లు. వీటికితోడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం..! క‌రోనా, వ‌ర‌ద‌ల క‌న్నా సుశాంత్ మ‌ర‌ణంపై ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు ఎందుకంత‌ కాన్స‌ట్రేష‌న్ చేస్తున్నారు..? నేతల వ్య‌వ‌హారం ఎలా ఉన్నా సుశాంత్ మ‌ర‌ణంలో నిందితుల్ని క‌ఠినంగా శిక్షించాలని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. క‌థ‌నం ప్ర‌కారం..

అభిమాన హీరో మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు :
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానిది బీహార్‌లోని పూర్నియా ప్రాంతం. సుశాంత్ పాట్నాలోనే పెరిగారు. ఆయ‌న సూసైడ్‌ త‌రువాత జూన్ 16న పాట్నా కార్గిల్ చౌక్ దగ్గర నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కరోనా కల్లోలాన్ని లెక్కచేయకుండా ఈ స్థాయిలో జనం వచ్చారంటే బిహార్‌ యువత సుశాంత్‌ను ఎలా ఇన్‌స్పైర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అభిమాన హీరో మరణాన్ని వాళ్లంతా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే సీఎం నితీష్‌ కుమార్‌ ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.



పోస్ట్‌మార్టం నివేదిక కోసం ముంబైకి బిహార్ పోలీసులు :
పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన బిహార్ పోలీసులు.. ముంబైలో పోస్ట్‌మార్టంపై ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన రిపోర్ట్‌ కోసం వెళ్లారు. ముంబై పోలీసులు అందుకు నిరాక‌రించడంతో బీహార్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి వినయ్ తివారిని రంగంలోకి దింపింది. హుటాహుటిన ఆయన ముంబై వెళ్లగా అధికారులు కరోనా పేరుతో 14 రోజుల పాటు బ‌ల‌వంతంగా క్వారంటైన్‌కు తరలించారు.

సాధార‌ణంగా అత్యవసర సేవ‌ల‌ను అందించేవారికి క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉండవు. అయినప్పటికీ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మాత్రం ఈ విష‌యంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. చ‌ట్టాలు, నియ‌మాలు అన్నీ తెలిసిన అధికారులే నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కారని మండిపడ్డారు బిహార్ నేతలు.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకుని విమర్శలు
సుశాంత్‌ ఆత్మహత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు బిహార్‌ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుశిల్‌ మోదీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.



బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో సీఎం ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న బాలీవుడ్ మాఫియా ఒత్తిడిలో ఉన్నారని.. అందుకే సుశాంత్‌ కేసులో బాధ్యులైన వారిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాహటంగానే విమర్శలు ఎక్కుపెట్టారు.

అమిత్ షాకు పప్పుయాదవ్ లేఖ :
సుశాంత్ మ‌ర‌ణంపై సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరుతూ బీహార్ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ బీజేపీ అల‌య‌న్స్‌లో లోక్ స‌భ ఎంపీ చిరాగ్ పాస్వాన్ సీఎం నితీష్ కుమార్ కు లేఖ‌రాశారు. ఈ లేఖ‌తో బీజేపీ నేత‌లు సైతం సుశాంత్ సింగ్ కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలతో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. లోక్ స‌భ మాజీ ఎంపీ జాన్, జ‌న్ అధికార పార్టీ ఎంపీ ప‌ప్పు యాదవ్‌లో మరో అడుగు ముందుకేసి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సుశాంత్‌ది అనుమానాస్పద మ‌ర‌ణ‌మ‌ని.. సీబీఐ తో ద‌ర్యాప్తు చేసేలా జోక్యం చేసుకోవాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.



సుశాంత్‌ బిహార్‌ ఐకాన్‌ అంటూ ప్రశంసలు :
ఓ వైపు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పప్పు యాద‌వ్ వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ వారికి అవ‌స‌రమైన నిత్యావసర వ‌స్తువుల్ని పంపిణీ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో బీహార్ కు ఐకాన్ .. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటూ సంబోధిస్తూ ఆకాశానికెత్తాడు. త్వరలో జరిగే ఎన్నికల్లో సుశాంత్‌ మరణాన్ని అన్ని పార్టీల నేతలు వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ప్రజల్ని ఆక‌ర్షించేందుకు ఆయా పార్టీల నేత‌లు సుశాంత్ పేరును అస్త్రంగా వాడుకుంటున్నట్టు కూడా స్పష్టమవుతోంది.

రాజకీయ, బాలీవుడ్ బిగ్‌షాట్‌లను కాపాడే ప్రయత్నాలు :
ముంబై పోలీసులు సుశాంత్ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్టయితే బీహార్ పోలీసుల‌కు ఎందుకు సహకరించడం లేదన్నదే పెద్ద ప్రశ్న. ఒక రాష్ట్ర పోలీసులు మరో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించకుంటే నేరస్తుల్ని పట్టుకోవడం కష్టతరంగా మారుతుంది. బిహార్ పోలీసులకు ముంబై పోలీసులు ఎందుకు సహకరించడం లేదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వాళ్లు నిజంగానే.. కొందరు ఆరోపిస్తున్నట్టుగానే ముంబైలో ఉన్న కొంద‌రు రాజ‌కీయ‌, బాలీవుడ్ బిగ్‌షాట్స్‌ను కాపాడేందుకు ప్రయ‌త్నిస్తున్నారా ?



గ‌ప్‌చుప్‌గా సుశాంత్ కేసును నీరు గార్చే ప్రయ‌త్నం చేస్తున్నారా అన్న అనుమానాల‌కు బ‌లం చేకూరుతోంది. ముంబై పోలీసులు సుశాంత్‌కు న్యాయం చేయాలని భావిస్తే.. ఇత‌ర రాష్ట్ర పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న అదే కేసుకి స‌హ‌క‌రించాలి. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. దీన్ని బ‌ట్టి చూస్తే ముంబై పోలీసుల వెనుక మ‌హారాష్ట్ర స‌ర్కారు త‌న‌దైన శైలిలో ప్రభావం చూపిస్తుంద‌నే విష‌యం క్లియర్ కట్‌గా తెలుస్తోంది.