హైదరాబాద్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బంద్..

హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ కొద్దిరోజుల పాటు మూతపడనున్నాయి..

  • Published By: sekhar ,Published On : March 14, 2020 / 06:08 AM IST
హైదరాబాద్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బంద్..

హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్ కొద్దిరోజుల పాటు మూతపడనున్నాయి..

కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడబోతున్నాయనే వార్త.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నెత్తిన పిడుగు పడినట్టైంది. గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రపంచాన్ని గజగజ వణికిస్తుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపడుతోంది.

అత్యవసరం అయితే తప్ప, అది కూడా మాస్కులు లేనిదే ఎవరూ బయటకు రావడంలేదు. ఈ నేపథ్యంలో జనాభా రద్దీ అధికంగా ఉండే సినిమా హాళ్లు మూసేయాలనే వార్త వినిపిస్తోంది. కరోనా పుట్టిల్లు చైనాలో ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. కేరళలో ఈ నెల 31 వరకూ సినిమా థియేటర్లు, స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక వారం లేదా పదిరోజుల పాటు థియేటర్లకు తాళం వేయనున్నారు. ఇప్పుడు నడుస్తున్న సినిమాల పరిస్థితి బాగోలేదు. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.

మేనేజ్ మెంట్ కష్టంగా మారింది. కొత్త సినిమాల విడుదల విషయంలో క్లారిటీ లేదు. ఉగాదికి రావలసిన నాని, సుధీర్ బాబుల ‘వి’ చిత్రం వాయిదా పడినట్టేనని సమాచారం. దీనితోపాటు పలు సినిమా షూటింగులు, రిలీజులు కూడా వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా సినీ పెద్దలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కొద్దిరోజుల పాటు థియేటర్లు బంద్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పలు షాపింగ్ మాల్స్ కూడా మూత పడనున్నట్టు సమాచారం.

Also Read | ‘అమృతం’ అదరహో.. మళ్లీ నెంబర్ 1 అనిపించుకుంది..