టెన్ టీవీ ఎఫెక్ట్, కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీలో తరలించిన అధికారులపై వేటు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. కరోనా భయం మనిషిని హృదయం లేని బండరాయిలా చేస్తోంది. కరోనా పుణ్యమా అని మనిషిలో జాలి, దయ, కరుణ అన్నవి కనిపించకుండా పోయాయి. సాటి మనిషిని చేరదీయలేని రీతిలో మనిషి మారిపోతున్నాడు. ఓ వృద్ధుడు కరోనాతో చనిపోతే మున్సిపాలిటీ అధికారులు దారుణంగా వ్యవహరించారు. చనిపోయిన పశువులను, చెత్తను తరలించిన రీతిలో కరోనాతో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీలో తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఈ ఘటన అందరిని కదిలించింది.

వృద్ధుడి మృతదేహం జేసీబీలో తరలింపు:
పలాస మున్సిపాలిటీ పరిధిలో 70ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో నిన్న(జూన్ 26,2020) చనిపోయాడు. ఈ ప్రాంతం కంటైన్ మెంట్ జోన్ కావడంతో మృతదేహం నుంచి అధికారులు శాంపుల్స్ సేకరించారు. శాంపుల్స్ లో కరోనా లక్షణాలు గుర్తించిన అధికారులు కుటుంబసభ్యులను దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా మున్సిపాల్టీ అధికారులు వారిని వారించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు చేయాలని చెప్పడంతో కుటుంబసభ్యులు వెనక్కి తగ్గారు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు పారిశుద్ధ కార్మికులు కూడా ముందుకు రాలేదు. దీంతో మున్సిపాలిటీ అధికారులు జేసీబీని తీసుకొచ్చారు. అందులో మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించారు.

టెన్ టీవీ కథనాలతో చలనం:
జేసీబీలో మృతదేహం తరలింపు దృశ్యాలను ముందుగా టెన్ టీవీ ప్రసారం చేసింది. అమానవీయం అంటూ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహం తరలింపు విధానాన్ని కలెక్టర్ తప్పు పట్టారు. పలాస తహసీల్దార్ మధుసూదన్, మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలతో సమగ్రంగా దర్యాఫ్తు జరిపారు. అమానవీయ ఘటనకు బాధ్యులను చేస్తూ పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజులను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

పలాస మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారి తీరు సభ్య సమాజం తల దించుకునేలా చేసిందంటున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా మృతదేహాన్ని కవర్ లో చుట్టి జేసీబీలో తీసుకెళ్లడం మానవత్వానికి మచ్చగా మారిందంటున్నారు.

Read: ఏపీ ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

Related Posts