లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ప్రమాదమా? కుట్ర కోణమా? : ఎమ్మెల్యే చెల్లి, బావ మృతిపై అనుమానాలు

కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం

Published

on

mystery behind mla manohar sister family death

కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూర్ దగ్గర కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం మరింత సంచలనం రేపింది. మృతులను దాసరి మనోహర్ చెల్లెలు రాధ, బావ నారెడ్డి సత్యనారాయణ రెడ్డి, వారి కూతురు వినయశ్రీలుగా పోలీసులు గుర్తించారు. 2020, జనవరి 27వ తేదీన ఎమ్మెల్యే సోదరి కుటుంబం మిస్సింగ్ అయ్యింది. అప్పటి నుంచి వారి ఆచూకీ లేదు. సడెన్ గా.. కాల్వలో శవాలుగా కనిపించారు.

20 రోజుల తర్వాత సోమవారం(ఫిబ్రవరి 17,2020) కాల్వలో కారు బయటపడింది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) బైక్ పై వెళ్తున్న దంపతులు కాకతీయ కాల్వలో పడ్డారు. వారిని గాలించేందుకు అధికారులు నీటి ప్రవహాన్ని తగ్గించారు. ఈ క్రమంలో కాల్వలో ఉన్న కారు బయటపడింది. కారుని గుర్తించిన పోలీసులు దాన్ని వెలికితీశారు. అందులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలున్నాయి. కారు నెంబర్ AP15 BN 3438 ఆధారంగా పోలీసులు మృతులను గుర్తించారు.

ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. జనవరి 27 నుంచి ఎమ్మెల్యే సోదరి కుటుంబం అదృశ్యమైంది. అసలేం జరిగింది? ఇది ప్రమాదమా? కుట్ర కోణమా? అనేది మిస్టరీగా మారింది. 20రోజులుగా చెల్లెలి కుటుంబం మిస్సింగ్ అయినా.. ఎమ్మెల్యే దాసరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అనేది హాట్ టాపిక్ గా మారింది. సత్యనారాయణ రెడ్డి కుమారుడు కూడా ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

ఈ ఘటనపై సీపీ కమలాసన్ రెడ్డి స్పందించారు. కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ కమలాసన్ రెడ్డి.. జనవరి 27న ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చామన్నారు. కారు ప్రమాదంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు కారుని గుర్తించామన్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులను గుర్తించామన్నారు. కారుపై పలు చలాన్లు ఉన్నాయన్నారు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ పైన కానీ కారు ప్రమాదం పైన కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేన్నారు.

చెల్లెలి కుటుంబం మృతితో ఎమ్మెల్యే దాసరి మనోహర్ షాక్ కి గురయ్యారు. దాసరి మనోహర్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దాసరి.. అసలేం జరిగిందో తనకు తెలియదన్నారు. తన సోదరి కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేవన్నారు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రకు వెళ్తుందని.. ఈసారి కూడా అలానే వెళ్లిందని అనుకున్నామని చెప్పారు.

జనవరి 27న తన సోదరి కుటుంబం కారులో బయటకు వెళ్లిందని ఎమ్మెల్యే చెప్పారు. ఆ తర్వాత నుంచి వారి ఆచూకీ లేదన్నారు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో ఉందన్నారు. చెల్లెలి కుటుంబం అదృశ్యంపై 20 రోజులుగా ఆందోళనలో ఉన్నామన్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే వివరించారు. ఎక్కడో ఒక చోట అంతా క్షేమంగా ఉంటారని అనుకున్నానని… ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి మిస్టరీగా మారింది. అసలు కారులో ఎక్కడికి వెళ్లారు? ప్రమాదానికి గురయ్యారా? కుట్రకోణం ఉందా? మరో కారణం ఏదైనా ఉందా? ఇప్పుడీ మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు.

Read More>> ట్రోల్స్ ఆపేయండి ప్లీజ్‌.. నేను కుక్క బిస్కెట్లు తినను!..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *