లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

నల్లగొండ పోలీసుల ఖలేజా.. ప్రాణాలకు తెగించి రాజస్థాన్‌కి వెళ్లి భయంకర పరిస్థితుల మధ్య నిందితుల అరెస్ట్

Published

on

nalgonda police khaleja: పోలీసుల పేరుతోనే నకిలీ ఫేస్ బుక్‌ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు నల్లగొండ జిల్లా పోలీసులు. వాళ్లూ వీళ్లూ ఎందుకనుకున్నారో ఏమో..పోలీసులనే ప్లాన్‌లో భాగం చేసేసింది ఈ ముఠా. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే నినాదంతో ప్రజలతో కలిసిపోయే పోలీసులను.. అదే ప్రజలను ఈజీగా మోసం చేసేందుకు తమ స్కెచ్‌లో పావులుగా వాడుకుంది. అలా ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు.. సుమారు 5 దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆపరేట్ చేసింది. ఏకంగా జిల్లా ఎస్పీ, డీఐజీ రంగనాథ్ పేరుతోనే ఖాతాను సృష్టించి.. డబ్బులు అడగడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు నల్లగొండ పోలీసులు.
రాజస్థాన్ కు వెళ్లిన నలుగురు సభ్యుల బృందం:
సైబర్ ఆపరేషన్స్‌లో అనుభవమున్న ఇన్‌స్పెక్టర్ మహబూబ్ బాషా, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఈ ముఠాను పట్టుకునేందుకు వేట ప్రారంభించింది. చివరకు రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామం కేంద్రంగా ఈ ముఠా నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల కోసం ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో.. అక్కడి పోలీసుల సహకారం నామమాత్రంగానే ఉండడంతో నిందితులను గుర్తించినా వెంటనే అరెస్ట్ చేయలేకపోయారు.

ఎవరికీ అనుమానం రాకుండా, తమను తాము కాపాడుకుంటూ ఆపరేషన్:
అలా అని ఎక్కువ రోజులు ఉందామన్నా.. అక్కడ ఉన్న ప్రతి నిమిషం కత్తి మీద సాములాంటిదే. అందుకే ఉన్న కొద్దిరోజుల్లోనే తమ మీద ఎవరికీ అనుమానం రాకుండా కామ్‌గా పని కానివ్వాలి. సరిగ్గా ఇదే చేశారు నల్లగొండ పోలీసులు. అనుక్షణం అప్రమత్తమై ఓవైపు నిందితుల వివరాలు సేకరిస్తూనే.. తమను తాము కాపాడుకుంటూ అనుకున్నది 5 రోజుల వ్యవధిలోనే సాధించారు. ప్రాణాలను పణంగా పెట్టి రాజస్తాన్ వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఏమాత్రం తేడా వచ్చినా దాడికి పాల్పడే గ్రామస్తులు:
సినిమా సీన్‌లను తలపించేలా డేరింగ్‌ స్టెప్స్ తీసుకుని మరీ రాజస్థాన్‌ నుంచి ఈ కేటుగాళ్లను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. రాజస్థాన్ అంటే సినిమాల్లో చూపించినట్టే కాదు.. రియల్‌గానూ అదే భయంకర సీన్‌లు ఉంటాయి. ఏ మాత్రం తేడా వచ్చిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేయడం.. అవసరమైతే నాటు తుపాకులతో కాల్పులకు తెగబడడం అక్కడ అలవాటు.

ఆడమగా అనే తేడా ఉండదు.. అందరూ మూకమ్మడి దాడి చేయడం.. పోలీసులు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్లెవరో తమకు తెలీదని తమపై దాడి చేయాలని చూస్తే ఎదురుదాడి చేశామని చెప్పడమే వాళ్లకి తెలుసు. సినిమాల్లో చూస్తే వామ్మో ఇలాంటి మనుషులుంటారా అని అనుమానిస్తాం. కానీ..అక్కడ అడుగడుగునా ఇవే సీన్‌లు కనిపిస్తాయి. లోకల్‌ పోలీసులనే గడగడలాడిస్తారంటే వీరి క్రూరత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
చింపిరి గడ్డం, షార్ట్స్, లుంగీలు.. రోడ్లపైనే నిద్ర:
అలాంటి భయంకర పరిస్థితిల్లో..ఆ పరిసర ప్రాంతాల్లో కొన్నాళ్లు కారు డ్రైవర్లుగా.. వివిధ పనులపై వచ్చిన వారుగా నల్లగొండ పోలీసులు అక్కడ తిరిగారు. ఎక్కడా పోలీసులమనే అనుమానం రాకుండా.. చింపిరి గడ్డం, షార్ట్స్‌, లుంగీలతో ఆ ప్రాంతం వారితో కలిసిపోయారు. కొన్నిసార్లు రోడ్లపైనే పడుకున్నారు. లోకల్ పోలీసుల సహకారం పెద్దగా లేకపోయినా.. దాదాపు ఐదు రోజుల పాటు పక్కాగా స్కెచ్ వేసి.. ఓ తెల్లవారుజామున ఆ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఊరు దాటించారు. కేవలం పది నిమిషాల్లో తమ పని ముగించారు.

దాదాపు ఐదు రాష్ట్రాల పోలీసులను వేధిస్తున్న నకిలీ ఖాతాల తతంగానికి చెక్ పెట్టారు నల్లగొండ పోలీసులు. ఈ ముఠా బారిన ఐదు రాష్ట్రాల పోలీసులు ఉండగా తెలంగాణ పోలీసులు ఈ ముఠా భరతం పట్టడంతో.. అన్ని రాష్ట్రాల పోలీస్ అధికారుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఆపరేషన్ లో చాలా ఇబ్బంది పడ్డామని.. స్థానిక పోలీసుల సహకారం పెద్దగా అందలేదని ఆపరేషన్ కేత్వాడ టీమ్ చెప్పింది.


పెద్దగా చదువుకోలేదు, పైగా డ్రైవర్లు.. అయినా సైబర్ నేరాలు చేయడంలో ఆరితేరిపోయారు:
వారంతా పెద్దగా చదువుకోలేదు. ఆటో, ట్రక్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. కానీ ఆమోఘమైన తెలివితేటలు వారి సొంతం. ఆటో, ట్రక్ డ్రైవర్లు అయినప్పటికి.. ఏకంగా 350మంది పోలీసుల పేర్లతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. వారి పేరుతో ఇతర పోలీసు సిబ్బంది నుంచి డబ్బు దండుకున్నారు. రాజస్తాన్ కి వెళ్లిన నల్గొండ పోలీసు బృందం, నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రూ.5లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. అలాగే 8 ఫోన్లు, 30 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు తెలంగాణకు చెందిన 81మంది పోలీసు అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించారు. దేశవ్యాప్తంగా 350 మంది పోలీసు అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేశారు.

నిందితులు బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుని పోలీసులు షాక్:
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముస్తాకీమ్, సద్దామ్ ఖాన్, షాహీద్, ఓ మైనర్ ఉన్నాడు. వారంతా రాజస్తాన్ లోని భరత్ పూర్ జిల్లాకి చెందిన కేత్వాడ వాసులు. తన పేరుతో పాటు ఇతర పోలీసు అధికారుల పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేశారనే విషయం తెలిసిన వెంటనే, నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అలర్ట్ అయ్యారు. క్రిమినల్స్ ను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేశారు. నిందితులు పెద్దగా చదువుకోకపోయినా సైబర్ నేరాలు చేయడంలో ఆరితేరారని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. నిందితుల్లో ఒకడు మైనర్ ఉన్నాడు. నిందితులు ఆటో, ట్రక్ డ్రైవర్లు అని తెలుసుకుని పోలీసులు విస్మయం చెందారు. ఈ క్రిమినల్స్ చాలానే నేరాలు చేశారు. ఓఎల్ ఎక్స్ లో పాత ఆర్మీ వాహనాల పేరుతోనూ మోసానికి పాల్పడ్డారు.

ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోసాలు:
ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసింది తామే అని నిందితులు ఒప్పుకున్నారు. కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ పోలీసు అధికారుల పేరుతో 350 ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసినట్టు అంగీకరించారు. సోషల్ మీడియా ద్వారా ముందుగా ఫొటోలు డౌన్ లోడ్ చేసుకుంటారు. వాటి ఆధారంగా ఫేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇతరులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ తర్వాత చాటింగ్ చేస్తారు. ఆపై డబ్బు అవసరం ఉందని అడుగుతారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని చెబుతారు. అంత పెద్ద అధికారి డబ్బు అడిగేసరికి కాదనలేక కొంతమంది ఇచ్చేస్తున్నారు.

డబ్బు ఎరవేసి బ్యాంకు అకౌంట్లు, సిమ్ కార్డులు, ఆధార్ కార్డులు సంపాదిస్తారు:
పలు రాష్ట్రాల్లో ఇతర వ్యక్తుల పేరు మీదున్న బ్యాంకు అకౌంట్లు సంపాదిస్తారు. వారి పేరు మీద సిమ్ కార్డులు పొందుతారు. డబ్బు అవసరం ఉన్న వ్యక్తులను ఎంచుకుని, వారికి డబ్బు ఎరవేస్తారు. ఆ తర్వాత వారి బ్యాంకు అకౌంట్లు, వారి పేరు మీద సిమ్ కార్డులు, వారి ఆధార్ కార్డులు సేకరిస్తారు. అలాగే ఐడీ ప్రూఫ్ సేకరిస్తారు. ఇందుకోసం ఒక్కో దానికి రూ.3వేలు ఇస్తారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *