nara lokesh

ఏపీలో భారీ భూ కుంభకోణం, 40మంది వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర, బాంబు పేల్చిన లోకేశ్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ స్పీడ్ పెంచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్‌లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరుతో పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడ్డారన్నది ఆయన ఆరోపణ. మళ్లీ ఆ స్థలాలను మెరక పేరుతో వైసీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని, మొత్తం ఇళ్ల స్థలాల కుంభకోణం దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించామని ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్:
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేశారని.. తక్కువ ధరకు పేదల దగ్గర భూములు కొని వెంటనే ఎక్కువ ధరకు పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి అమ్మి, భారీగా సొమ్ము చేసుకున్నారన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఈ ఇళ్ల స్థలాలకి సంబంధించిన కీలక సమాచారం సేకరించి పెట్టాలని తమ నేతలను టీడీపీ హైకమాండ్ ఆదేశించిందట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు చేసిన భూ కుంభకోణాలకు సంబంధించి కీలక ఆధారాలను టీడీపీ సేకరించిందట. అవసరమైతే వీటి ఆధారంగా న్యాయస్థానాల్లో కేసులు కూడా వేయడానికి సిద్ధమవుతోందని అంటున్నారు.

తమ్ముళ్లపై చంద్రబాబు ఆగ్రహం:
ఇప్పటికే కొన్ని ప్రజాసంఘాలు, ఆయా ప్రాంతాల్లోని స్థానికులు హైకోర్టులో కేసులు వేసి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ వివాదాలు నడుస్తున్నాయి. టీడీపీకి చెందిన చాలామంది ఇన్‌చార్జ్‌లు ఓటమి తర్వాత నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జరుగుతున్న ఈ వ్యవహారాలపై వారు పార్టీకి నివేదిక ఇవ్వలేకపోతున్నారట. నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతే ఎలా అంటూ ఆయా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. నియోజకవర్గాల్లో పార్టీని వదిలేసి తిరుగుతున్న నేతలు చాలా మంది ఉన్నారని గుర్తించారు.

ఆధారాలు సేకరించిన లోకేష్:
ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగి నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పేరుతో, వాటిని చదును చేసే పేరుతో ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు జరిగాయి? వాటి వివరాలు మొత్తం కూడా సాధ్యమైనంత వరకు సేకరించింది. ఈ ఆధారాలను ఆసరాగా చేసుకొని లోకేశ్‌ ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూసేకరణ పేరుతో అతి పెద్ద కుంభకోణం చేసిందని టీడీపీ విచారణలో తేలిందట. అందుకే దీనిపై లోతైన అధ్యయనం చేస్తోందని అంటున్నారు.

భూ స్కామ్ లో 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు:
మరోపక్క, 40 మంది ఎమ్మెల్యేలు అసలు లబ్ధి పొందారని నిర్ధారించే ఆధారాలు ఉన్నాయా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మాట వరసకి లోకేశ్‌ 40 మంది ఎమ్మెల్యేలు ఈ కుంభకోణంలో ఉన్నారని అన్నారని, కేడర్ లో ఉత్సాహం నింపటానికే అలా వ్యాఖ్యానించారని మరి కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే భూముల కొని, మళ్లీ ప్రభుత్వానికి అమ్మి ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డారని ఆధారాలు సంపాదించిందట.

వినుకొండ ఎమ్మెల్యేపై ఆరోపణలు:
వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎక్కడో ఊరి చివరనున్న తన భూమిని ఇళ్ల స్థలాల పేరుతో అంటగట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా ఊరి చివర తన మనుషులతో భూములు కొనిపించి అక్కడ ఇళ్ల స్థలాల పేరుతో పేదలకు భూములు ఇచ్చేందుకు నిర్ణయించారని అంటున్నారు. ఇక్కడ కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆవ భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఇది చివరికి హైకోర్టు వరకు వెళ్ళింది.

టీడీపీ ఫైర్ బ్రాండ్‌కు ఏమైంది? ఎందుకు సైలెంట్ అయ్యారు? కారణం చంద్రబాబేనా?


మాజీ మంత్రి వందల కోట్ల స్కామ్:
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పార్థసారథి కూడా ఇళ్ల స్థలాల పేరుతో వందల కోట్ల కుంభకోణం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూడా వసంత కృష్ణప్రసాద్ అవకతవకలకు పాల్పడ్డారని దేవినేని ఉమ ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ కాకుండా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి పెట్టుకుందట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ సేకరిస్తోందట.

భూ స్కామ్ పై లోకేష్ ఫోకస్:
ఎమ్మెల్యేలు, తమ కుటుంబ సభ్యులు, తమ దగ్గర పని చేసే వ్యక్తుల పేరు మీద ముందే ఆయా ప్రాంతాలలో భూములు కొనుగోలు చేసి వెంటనే ప్రభుత్వానికి అధిక ధరకు అమ్ముకుని భారీగా లబ్ధి పొందారని అంటున్నారు. ఈ సాక్ష్యాలను సేకరించి హైకోర్టులో కేసులు వేసే ఆలోచనలో టీడీపీ ఉందని చెబుతున్నారు. దీనిపై టీడీపీ యువనేత లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

టీడీపీ లీగల్ టీం క్రియాశీలకంగా పని చేస్తోందట. స్థానికంగా ఉన్న ఇన్‌చార్జులు పట్టించుకోకపోయినా లీగల్ టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, స్థానిక కార్యకర్తల ద్వారా వివరాలు సేకరిస్తోందని అంటున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని, తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు లోకేశ్‌.

Related Posts