చైనాతో బిజినెస్ వద్దనుకుంటున్న ప్రపంచదేశాలు..భారత్ కు వరం : నితిన్ గడ్కరీ

చైనాతో బిజినెస్ వద్దనుకుంటున్న ప్రపంచదేశాలు..భారత్ కు వరం : నితిన్ గడ్కరీ

చైనాతో బిజినెస్ చేయకూడదని ప్రపంచదేశాలు భావిస్తున్నాయని,ఇది భారతదేశానికి బ్లెస్సింగ్(ఆశీర్వాదం) అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)ల విషయంలో భారత ప్రభుత్వం ఇటీవల రూల్స్ ని సవరించిన విషయం తెలిసిందే. అయితే FDI కొత్త నిబంధనల  విషయంలో భారత ప్రభుత్వం వివక్ష ఉండకూడదన్న WTO(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)సూత్రాలను ఉల్లంఘించిందని,భారత ప్రభుత్వ నిర్ణయం ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్ కు విరుద్ధం అంటూ ఇటీవల చైనా భారత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో శనివారం(ఏప్రిల్-25,2020)ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చైనా సూపర్ ఎకనామిక్ పవర్ (ఆర్థిక శక్తి)అయినప్పటికీ… ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం.. చైనాతో వాణిజ్యం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇది భారతదేశానికి ఒక వరం. ఇది మనకు ఒక అవకాశమని గడ్కరీ అన్నారు. 2025 నాటికి భారతదేశాన్ని5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాన్ని నెరవేర్చడానికి ఇది ప్రభుత్వానికి అవకాశంగా ఉంటుందని గడ్కరీ సూచించారు.

భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని విజన్ ను నెరవేర్చడానికి కొత్త టెక్నాలజీని పెట్టుబడులుగా మార్చడానికి ఓ జాయింట్ సెక్రటరీని నియమిస్తామని గడ్కరీ తెలిపారు. మరోవైపు, IMF ఈ సంవత్సరం భారతదేశానికి 1.9 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. 2021 లో చైనా మరియు భారతదేశం రెండూ బలంగా పుంజుకుంటాయని అంచనా వేసింది.

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో దాని పాత్రపై చైనా విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ వైరస్ ను చైనానే సృష్టించిందంటూ అమెరికా అధ్యక్షుడితో సహా పలు దేశాధినేతలు బహిరంగంగానే చైనాపై ఫైర్ అవుతున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదటిసారి చైనాలోని వూహాన్ సిటీలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో… చైనా ప్రభుత్వం  వైరస్ వ్యాప్తి గురించి సకాలంలో ప్రపంచానికి తెలియజేయడంలో విఫలమైందని మరియు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) నిబంధనలను చైనా ఉల్లంఘించినట్లు తెలిపారు.

కాగా,ఇప్పటివరకు COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 28.25 లక్షల మందికి సోకింది. దాదాపు 2 లక్షల మంది మరణించారు. భారతదేశం లో కేసుల్లో మార్చి చివరి నుండి… ప్రభుత్వం అతి తక్కువ రోజువారీ వృద్ధి రేటును శనివారం ప్రకటించింది, భారత్ లో దాదాపు 25,000 కేసులు, 779 మరణాలు నమోదయ్యాయి.