కోటి మంది హెల్త్ వర్కర్లకే మొదటగా కరోనా వ్యాక్సిన్

కోటి మంది హెల్త్ వర్కర్లకే మొదటగా కరోనా వ్యాక్సిన్

1Covid Vaccine కరోనా వ్యాక్సిన్ సరఫరాకి సిద్ధమైన తర్వాత మొద‌ట‌గా దేశంలోని 1 కోటి మంది హెల్త్ కేర్ వర్కర్లు(ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ు)కి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. శుక్ర‌వారం జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో అన్ని పార్టీల‌కు ఈ మేరకు కేంద్రం స‌మాచారం ఇచ్చింది. హెల్త్ వర్కర్ల తర్వాత క‌రోనాపై ముందువరుసలో నిలబడి పోరాటం చేస్తున్న పోలీసులు, మున్సిప‌ల్ వ‌ర్క‌ర్లుకి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు.



శుక్రవారం(డిసెంబర్-4,2020)ప్ర‌ధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్‌ జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ మీటింగ్ లో ప్ర‌ముఖ పార్టీల‌కు చెందిన 12 మంది నేత‌లు పాల్గొన్నారు. మీటింగ్ సందర్భంగా కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ప్రెజెంటేష‌న్ ఇచ్చారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్స్‌ల‌కు మొద‌ట వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు ఈ ప్రెజెంటేష‌న్‌లో భాగంగా రాజేష్ భూష‌ణ్ వెల్ల‌డించారు. అదేవిధంగా, 27మంది సీనియర్ సిటిజన్లకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు భూషణ్ తెలిపారు.



కాగా, ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. వ్యాక్సిన్ కోసం భారత్ వైపే ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తున్నట్లు మోడీ చెప్పారు. వ్యాక్సిన్ త‌యారీలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విశ్వాసంతో ఉన్న‌ట్లు తెలిపారు. శాస్త్ర‌వేత్త‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంటేనే భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుందన్నారు.



ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ వ్యాక్సిన్ ధ‌ర‌ నిర్ణ‌యించబడుతుందని ప్రధాని చెప్పారు. వ్యాక్సిన్ ధ‌ర విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో కేంద్రం సంప్ర‌దిస్తున్నట్లుగా మోడీ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ ఎలా చెయ్యాలనే విషయంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ బృందాలు కలిసి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాయ‌ని, వ్యాక్సిన్ పంపిణీలో ఇత‌ర దేశాల‌తో పోలిస్తే భార‌త్ మెరుగైన స్థానంలో ఉంటుందని మోడీ తెలిపారు.