Delhi Rain : నీట మునిగిన బస్సు..కొట్టుకపోయిన ఇల్లు

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 01:05 PM IST
Delhi Rain : నీట మునిగిన బస్సు..కొట్టుకపోయిన ఇల్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం ముంచెత్తింది. 2020, జులై 19వ తేదీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

భారీ వర్షాలతో ప్రజా రవాణా స్తంభిస్తోంది. వాన నీటిలో చిక్కుకున్న వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి. మింటో బ్రిడ్జి కింద వర్షపు నీరు పెద్ద ఎత్తున ఆగడంతో… డీటీసీ బస్సు నీట మునిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. అన్నా నగర్ లో వరద ధాటికి ఓ ఇల్లు కొట్టుకపోయింది.

ఢిల్లీలోని ఆదంపూర్‌, హిస్సార్‌, హన్సి, జింద్‌, గోహానా, గనౌర్‌, బరూత్‌, రోహ్‌తక్‌, సోనిపట్‌, బాగ్‌పాట్‌, గురుగ్రామ్‌, నొయిడా, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

మరో రెండు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హరియాణ, చండీగఢ్‌ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది.

భారీ వర్షంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షపు నీటితో ఢిల్లీలోని ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో.. రాజధాని ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు.

సుమారు మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో.. వర్షపు నీటిలోనే ప్రయాణం సాగిస్తున్నారు ఢిల్లీ వాసులు. ఇక మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా తరలించేందుకు మున్సిపల్‌ సిబ్బంది శ్రమిస్తున్నారు.