Sedition Case On Farmers : బీజేపీ నేత కారుపై దాడి..100మంది రైతులపై దేశ ద్రోహం కేసు

హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది.

Sedition Case On Farmers : బీజేపీ నేత కారుపై దాడి..100మంది రైతులపై దేశ ద్రోహం కేసు

Farmers

Sedition Case On Farmers హర్యానాలో 100 మంది రైతులపై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ నెల 11న సిర్సాలో అధికార బీజేపీ-జేజేపీ కూటమి నేతలకు వ్యతిరేకంగా మరియు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకి దిగారు. ఇదే సమయంలో హర్యానా డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వా అధికార వాహనాన్ని రైతులు అడ్డుకుని దాడికి ప్రయత్నించారని..కారుని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ అదే రోజున రైతు నేతలు హరిచరణ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌తో పాటు 100 మంది అన్నదాతలపై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హత్యాయత్నం,ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వర్తించడంలో ప్రభుత్వోద్యోగులను అడ్డుకోవడం వంటి సెక్షన్ల కింద రైతులపై కేసులు బనాయించారు సిర్సా పోలీసులు.

అయితే హర్యానాలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా భయానక వ్యూహాలను ప్రయోగించడం కొనసాగిస్తోందని సంయుక్త కిసాన్ మోర్చా(వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘం) విమర్శించింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానా రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు.. రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. తాజా కేసును కోర్టులో సవాల్‌ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ సంయుక్త కిసాన్ మోర్చా సహాయం చేస్తుందని పేర్కొంది.

సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) సీనియర్‌ నాయకుడు దర్శన్‌ పాల్‌ మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలతో రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దేశద్రోహ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం రైతులను రెచ్చగొడుతోంది. వాహనం అద్దం పగిలితే దేశద్రోహం, హత్య కేసులు ఎలా పెడతారు అని ప్రశ్నించారు. రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేయడం దేశద్రోహ నేరమా, వారిపై కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జేజేపీ, కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చే స్వతంత్రులతో సహా అందరు శాసన సభ్యులను శాంతియుతంగా బహిష్కరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని మేము ఇప్పటికే ప్రకటించాం అని దర్శన్‌ పాల్‌ అన్నారు.

మరోవైపు,దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన చేసే రైతులపై దేశ ద్రోహం కేసు విషయం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని,బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రాన్ని గురువారం ప్రశ్నించారు. ఈ చట్టం దుర్వినియోగం కాకూడదు అన్నదే తమ ఉద్దేశమని సీజేఐ వ్యాఖ్యానించారు.