రైతుల ఆందోళనలు :100 మీడియా సమావేశాలు..700 రైతు మీటింగ్ లకు బీజేపీ ఫ్లాన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2020 / 06:04 PM IST
రైతుల ఆందోళనలు :100 మీడియా సమావేశాలు..700 రైతు మీటింగ్ లకు బీజేపీ ఫ్లాన్

BJP’s Farm Laws Campaign Amid Pushback నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకి చేరుకున్నాయి. అయితే చట్టాలల్లో సవరణలకు బుధవారం కేంద్రం రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపగా… రైతలు వాటని తిరస్కరించారు. సవరణలు వద్దు చట్టాల రద్దే కావాలని రైతులు పట్టుబడుతున్నారు. దీంతో ఆరు దఫాలుగా రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు నేతలు తేల్చిచెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలపై అటు కేంద్రం..ఇటు రైతులు వెనక్కితగ్గకపోవడంతో ప్రతిష్ఠంభణ నెలకొంది. ఈ నేపథ్యంలో మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఉన్న భయాందోళనలు తొలగించి,చట్టాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందు బీజేపీ సిద్ధమైంది. 100 ప్రెస్ కాన్ఫరెన్స్ లు(మీడియా సమావేశాలు) మరియు 700 జిల్లాల్లో రైతులతో 700 సమావేశాలు నిర్వహించేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. అతి త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ భారీ క్యాంపెయిన్ చేపట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది.

కేంద్రమంత్రులు కూడా క్యాంపెయిన్ లో పాల్గొనబోతున్నట్లు బీజేపీ వర్గాల నుంచి సమాచారం. కొత్త చట్టాలపై రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలు, కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళనలు, వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం చెబుతున్న పరిష్కరాలను ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించనుంది బీజేపీ.

మరోవైపు,వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, తక్షణమే రైతులు నిరసనలు విరమించి.. కేంద్రం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం(డిసెంబర్-11,2020)మరోసారి విజ్ఞప్తి చేశారు. చలికాలం,కరోనా పరిస్థితుల్లో ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతుల గురించి ఆందోళన చెందుతున్నట్లు తోమర్​ తెలిపారు. కేంద్రానికి ఎలాంటి అహంకారం లేదని,ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగానే ఉన్నట్లు తోమర్ తెలిపారు.

కాగా,నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చ‌ట్టాల వ‌ల్ల రైతులు కార్పొరేట్ల‌కు బ‌ల‌వుతార‌ని,తక్షణమే ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని గురువారం(డిసెంబర్-11,2020)భారతీయ కిసాన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది.