ఎయిర్ పోర్ట్ వద్ద ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్న 11మంది అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : November 17, 2020 / 09:55 PM IST
ఎయిర్ పోర్ట్ వద్ద ఆర్మీ దుస్తుల్లో తిరుగుతున్న 11మంది అరెస్ట్

11 In Army Uniform Couldn’t Present ID Cards, Arrested అసోం రాజధాని గౌహతిలోని LGBI ఎయిర్ పోర్ట్ దగ్గర్లో భారత ఆర్మీ యూనిఫాం ధరించిన 11మందిని మంగళవారం(నవంబర్-17,2020)పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 11మంది తమ కదలికలకు సంబంధించిన కారణం మరియు అధికారిక ఐడీ కార్డులను చూపించలేకపోయారని,వారి కార్యకలాపాలు తీవ్ర అనుమానాస్పదంగా ఉండటంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే,హై సెక్యూరిటీ జోన్ లో ఆర్మీ వేషధారణలో ఉండటం వెనుక అసలు వీరి ఉద్దేశ్యం ఏంటన్నది పోలీసులు ఇంకా కనిపెట్టాల్సి ఉంది.



మొదటగా పాట్రోల్ టీమ్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో ఆర్మీ దుస్తుల్లో ఉన్న నలుగురిని గుర్తించిందని,ఆ తర్వాత మిగిలిన ఏడుగురిని గుర్తించడం జరిగిందని అసోం పోలీసులు తెలిపారు. వీరందరూ అక్రమంగా ఆర్మీ యూనిఫాం ధరించారని,వీరి వద్ద భారత ఆర్మీ యొక్క ఐడెంటిటీ కార్డు లేదని,మొత్తం 11మందిని అరెస్ట్ చేసి ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్లు గౌహతి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవరాజ్ ఉపాధ్యాయ తెలిపారు. అయితే,వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు లభించలేదని ఆయన తెలిపారు.



గడిచిన నెల రోజులుగా ఈ 11మంది ఎయిర్ పోర్ట్ దగ్గర్లోనే ఉంటున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని దేవరాజ్ ఉపాధ్యాయ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం..అరెస్ట్ కాబడినవారిలో ఒకడైన ధిరిమాన్ గోస్వామి అనే వ్యక్తి మిగిలిన 10మందికి ఓ సెక్యూరిటీ కంపెనీకి చెందిన ఫేక్ అపాయింట్ మెంట్ లెటర్స్ ని ఇచ్చినట్లు తేలింది. వీరందరూ నివాసముంటున్న అద్దె ఇంట్లో పోలీసులు సోదాలె నిర్వహించి ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.