భారత్‌లో 11లక్షలు దాటిన కరోనా బాధితులు, ఒక్కరోజే 40వేలకుపైగా కొత్త కేసులు

  • Published By: naveen ,Published On : July 20, 2020 / 10:09 AM IST
భారత్‌లో 11లక్షలు దాటిన కరోనా బాధితులు, ఒక్కరోజే 40వేలకుపైగా కొత్త కేసులు

భారత్‌లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 11లక్షల 18వేల 43కు చేరింది. భారత్ లో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

27వేల 497 మరణాలు:
కేసులే కాదు కొవిడ్‌ మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 681 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈస్థాయిలో మరణాలు సంభవించడం ఇది రెండోసారి. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 27వేల 497కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన వారంలోనే దేశవ్యాప్తంగా 2లక్షల 40వేల పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 7లక్షల 87 మంది కోలుకోగా 3లక్షల 90వేల 459 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63శాతం ఉండగా, మరణాల రేటు 2.5గా ఉంది.

గతంలో 17 రోజులు, ఇప్పుడు 21 రోజులు:
దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి దాదాపు 21రోజుల సమయం పడుతోంది. గతంలో 17రోజులుగా ఉన్న డబ్లింగ్‌ సమయం, ప్రస్తుతం 21కి పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ రోజువారీ కేసుల సంఖ్య భారీగా ఉంటోంది. జూన్‌ 30వ తేదీ నాటికి దేశంలో 5లక్షల 66వేల 840 పాజిటివ్‌ కేసులు.. 16వేల 893 మరణాలు రికార్డయ్యాయి. జులై 20నాటికి ఈ పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆ 21రోజుల్లోనే 10వేల 600 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు సంఖ్య బాగా పెంచారు. ఇప్పటివరకు కోటి 40 లక్షల 47వేల 908 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 2లక్షల 56వేల 039మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

24 గంటల్లో 2లక్షల 60వేల కరోనా కేసులు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ తీవ్రత యూరప్‌ దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికా, బ్రెజిల్‌, భారత్‌లలో రోజురోజుకు పెరుగుతోంది. కొన్నిరోజులుగా నిత్యం రికార్డుస్థాయి కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 59వేల 848 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకు ముందురోజు కూడా 2లక్షల 37వేల 743 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం అమెరికాలోనే 24గంటల్లో 71వేల 484 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, బ్రెజిల్‌లో 45వేలు, దక్షిణాఫ్రికాలో 13వేల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో శనివారం ఒక్కరోజే దాదాపు 39వేలు కేసులు, ఆదివారం ఒక్కరోజే 40వేల 425 కొత్త కేసులు బయటపడ్డాయి.

6లక్షలు దాటిన కరోనా మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా నిత్యం సరాసరి 4వేల 800 మరణాలు సంభవిస్తుండగా ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 7వేల 360 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కొవిడ్‌-19తో మరణించిన వారిసంఖ్య 6లక్షలు దాటాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 8వేల 542 మంది కరోనా బాధితులు మరణించారు. అమెరికాలో ఇప్పటివరకు 39లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా లక్షా 40వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 20లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడగా 78వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మూడోస్థానంలో ఉన్న భారత్‌లో బాధితుల సంఖ్య 11 లక్షలు దాటగా, 27వేల 497 మంది ప్రాణాలు కోల్పోయారు.