విషాదం నింపిన విహారయాత్ర, 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది మృతి

విషాదం నింపిన విహారయాత్ర, 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది మృతి

13 killed, 7 injured : అప్పటి దాక ఎంతో సంతోషంగా గడిపారు బాల్య స్నేహితులు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ..ఆనందంగా ఉన్నారు. మినీ బస్సులో కేరింతలు, పాటలతో సరదగా గడిపారు. కానీ విధి వక్రీకరించింది. ఎదురుగా వచ్చిన ఓ టిప్పర్ వాహనం..మినీ బస్సును ఢీకొంది. అంతే..అప్పటిదాక సందడిగా ఉన్న వాతావరణం బీభత్సంగా మారిపోయింది. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది దుర్మరణం చెందారు.

దావణగెరె నగరంలోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు బాల్య స్నేహితురాళ్లు. వీరంతా…కొంతకాలంగా..చిట్టీలు వేసుకున్నారు. అలా సమకూర్చుకున్న ఆదాయంతో..సంక్రాంతి నాడు గోవాకు బయలుదేరారు. డ్రైవర్ తో సహా బాల్య స్నేహితురాళ్లు 16 మంది, 16 ఏళ్ల అమ్మాయి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి దావణగెరె నుంచి గోవాకు మినీ బస్సులో బయలుదేరారు. తెల్లవారుజామున ధార్వాడకు సమీపంలో అంతులేని విషాదం నెలకొంది. ఇడగట్టి వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ రూపంలో మృత్యువు వారిని కబళించి వేసింది.

ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో..ఎదురుగా వచ్చిన టిప్పర్ అత్యంత వేగంగా ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో 13 మంది కన్నుమూశారు. మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నారు. మృతులంతా..దావణగెరె నగర పరిధి విద్యానగరకు చెందిన ఎంసీసీ బ్లాక్ నివాసులని గుర్తించారు. మృతులను పూర్ణిమా, ప్రవీణ, ఆశా, మానసి, పరంజ్యోతి, రాజేశ్వరి, శకుంతల, ఉషా, వేద, నిర్మల, మంజుల, రజని, ప్రీతిగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ధార్వాడా నగర ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.