తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం…మోడీ తరపున మొదటి పూజ

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 07:12 AM IST
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం…మోడీ తరపున మొదటి పూజ

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. ఇవాళ(మే-15,2020)తెల్లవారుజామున 4:30గంటల సమయంలో ఎంపిక చేయబడిన పూజారులు,  కొద్దిమంది దేవస్థానం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ ఈశ్వరి ప్రసాద్ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరిచారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. 

కరోనా కారణంగా ఆలయ ప్రధాని పూజారితో సహా అక్కడున్న అధికారులందరూ మాస్క్ లు ధరించి,సోషల్ డిస్టెన్స్ ను పాటించినట్లు దేవస్థానం బోర్డు మీడియా ఇన్ చార్జ్ హరీష్ గౌడ్ తెలిపారు. ఆలయ గేట్లు తెరిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరపున మానవజాతి సంక్షేమం కోసం పూజ నిర్వహించబడినట్లు తెలిపారు.

ఆలయం ఓపెనింగ్ సందర్భంగా భక్తులకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఓడిస్తామని,ఛార్ దామ్ యాత్ర త్వరలోనే ప్రారంభమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఆలయ ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తలు హాజరుకాలేకపోయినప్పటికీ ఆలయాన్ని 10క్వింటాళ్ల పూలు,లైట్లతో అలంకరించారు. 

బద్రీనాథ్.. హిందువుల ఒక పుణ్యక్షేత్రం. చార్ ధామ్ లలో బద్రీనాథ్ ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర అన్న విషయం తెలిసిందే. ఏటా శీతాకాలంలో మంచు కారణంగా మూసివేసే ఈ ఆలయాన్ని తిరిగి వేసవిలో తెరుస్తుంటారు.