మత్తులోనే ఉంటున్నారా : దేశంలో మందుబాబులు 16 కోట్లు

  • Published By: chvmurthy ,Published On : February 19, 2019 / 03:29 AM IST
మత్తులోనే ఉంటున్నారా : దేశంలో మందుబాబులు 16 కోట్లు

న్యూఢిల్లీ: మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మాహారాజులం అని గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు మందు మహారాజుల మీద పాట పాడుతా “మందు దిగేలోపు లోకాలన్నీ పాలిస్తామని ” చెపుతాడు. మద్యం మత్తులో అంత మజా ఉందేమో . మన దేశంలో జాతీయ స్థాయిలో 16 కోట్ల మంది మద్యం సేవించేవారు ఉన్నారని ఇటీవల నిర్వహించిన  ఓ సర్వేలో తేలింది. ఈసంఖ్య దేశ జనాభాలో 14.6 శాతంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది.  
 

దేశంలోని 186 జిల్లాలలో  చేసిన ఈ సర్వేలో మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.  మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు మద్యం సేవించటం వల్ల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే అని ఈ సర్వే ద్వారా వెల్లడయ్యింది. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్‌ ఆధ్వర్యంలోని ఎన్‌డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం-సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. 
 

‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది’ అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ చెప్పారు. 
 

దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచి చూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు  అంటే  డాక్టర్లు చెప్పిన దానికన్నా ఎక్కువ ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది.