భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..24 గంటల్లో 16,738 కొత్త కేసులు

భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..24 గంటల్లో 16,738 కొత్త కేసులు

corona new cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 వేల 738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 138 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు కేసులు రికార్డవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 16 వేలు దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది.

కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునే దిశగా సిఫార్సులు చేసేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్‌లో పర్యటించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది.

మహారాష్ట్రలోనూ కరోనా విజృంభిస్తోంది. నైట్‌ కర్ఫ్యూలు , పాక్షిక లాక్‌డౌన్లు విధించినా… కేసులు అదుపులోకి రావడం లేదు.. తాజాగా ఓ స్కూల్ హాస్టల్‌లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. వాసిం జిల్లాలోని స్కూల్ హాస్టల్‌లో చదువుతున్న 229 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

వీరితో పాటు నలుగురు ఉపాధ్యాయులు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్ధుల్లో ఎక్కువ మంది కరోనా తీవ్రత అధికంగా అమరావతి, యవత్మాల్‌ ప్రాంతాలకు చెందిన వాళ్లే. దీంతో అప్రమత్తమైన అధికారులు స్కూల్‌ ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.