Uzbekistan Cough Syrup Death: ఉజ్బెకిస్తాన్‌లో 18మంది చిన్నారులు మృతి.. ఇండియాలో తయారైన దగ్గు మందే కారణమట
భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తీసుకోవటం వల్ల ఉజ్బెకిస్తాన్‌లో 18మంది చిన్నారులు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

Uzbekistan Cough Syrup Death: భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తీసుకోవటం వల్ల ఉజ్బెకిస్తాన్‌లో 18మంది చిన్నారులు మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లల్లో 18మంది భారతీయ ఫార్మాస్యూటికల్ సంస్థ మారియన్ బయోటెక్ ఉత్పత్తి చేసిన డాక్-1 మాక్స్ సిరప్ తీసుకోవడం వల్ల మరణించారని ఉజ్బెకిస్తాన్ మంత్రిత్వ శాఖ తెలింది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ అధించాలని ఉజ్బెకిస్థాన్ను కోరింది.
భారత్‌లో తయారైన సిరప్ తాగి చిన్నారులు మరణించారని ఆరోపణలు రావడం ఇది రెండో ఘటన. గత కొద్దినెలల క్రితం ఆఫ్రికన్ దేశం గాంబియాలో హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు మందుతాగి 70 మందికిపైగా పిల్లలు మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ సిరప్ ఎవరూ వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థసైతం హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అప్పుడు, ఇప్పుడు పిల్లల మరణాలకు సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ ఉండటమే కారణమని తేలింది.
తాజాగా ఘటనతో ఉజ్బెకిస్థాన్‌లో డాక్-1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లపై నిషేదం విధించారు. అయితే, ఉజ్బెకిస్థాన్ ఆరోపణలపై భారత్ అప్రమత్తమైంది. ఈ సిరప్ ను ప్రస్తుతం భారత మార్కెట్ లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనపై సీడీఎస్ఓ నార్త్ జోన్, యూపీ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైనింగ్స్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని తెలిపింది.