తల్లి శవం పక్కనే రెండు రోజులుగా ఆకలితో పసిబిడ్డ..అక్కున చేర్చుకున్న కానిస్టేబుల్స్

తల్లి శవం పక్కనే రెండు రోజులుగా ఆకలితో పసిబిడ్డ..అక్కున చేర్చుకున్న కానిస్టేబుల్స్

18 Months Baby 2 Day Beside Mother Dead Body

18 months baby 2 day beside mother dead body : కరోనా భయంతో కళ్లముందు ఆకలితో చంటిబిడ్డ అల్లాడిపోతున్నా..గుక్క పట్టి గుండెలవిసేలా ఏడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తల్లి చనిపోయిందని కూడా తెలియని 18 నెలల పసిబిడ్డ అమ్మ మృతదేహం పక్కనే ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నా ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆ పసిబిడ్డ రెండు రోజులుగా ఆకలితో అలమటించిపోయి ఏడ్చే ఓపిక కూడా లేక దీన స్థితిలో పడి ఉన్న అత్యంత అమానవీయమైన ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది.

ఓ మహిళ తన 18 నెలల బిడ్డతో కలిసి పుణెలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడి శనివారం (మే 1,2021)న చనిపోయింది. ఆమె చనిపోయింది కరోనాతో అయి ఉండవచ్చనే భయంతో ఇరుగుపొరుగు వారు ఎవరూ ఆమె దగ్గరికి కూడా రాలేదు. కనీసం పసిబిడ్డను కూడా పట్టించుకోలేదు. దీంతో..రెండురోజుల పాటు ఆమె శవం ఇంట్లోనే ఉంది. ఆలనాపాలనా చూసేవాళ్లు లేక ఆ పసిబిడ్డ తల్లి మృతదేహం పక్కనే ఆకలితో ఏడుస్తూ ఉండిపోయాడు. కానీ..చిన్నారి బాధను చూడలేక ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి ఆకలి తీర్చారు.

ఈ అంత్యంత అమానవీయ ఘటన గురించి మహిళా కానిస్టేబుల్‌ సుశీల గభాలే మాట్లాడుతూ.. ‘‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఎనిమిది, మరొకరికి ఆరేళ్లు. ఆ చిన్నారిని చూడగానే నా కన్న బిడ్డల్నే చూసినట్లు అనిపించింది. మన బిడ్డలకే అటువంటి పరిస్థితి వస్తే అలా వదిలేస్తామా? అని ప్రశ్నించారు. ఈ కరోనా పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగటం చాలా బాధాకరమని అన్నారు. ఆకలిగా ఉన్నాడు కదా. పాపం ఆ పసిబిడ్డ బాగా ఆకలిగా ఉన్నాడేమో..పాలు పట్టగానే గబగబా తాగేశాడు’’ అని తల్లి మనసు నిండిన మనస్సుతో తెలిపిందామె.

మరో కానిస్టేబుల్‌ రేఖ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగా ఉన్నాడు. కాస్త జ్వరం కూడా ఉండటంతో డాక్టర్ కు చూపించాం. భయపడాల్సిన పనిలేదని డాక్టర్‌ చెప్పారు. పాలు తాగించడంతో పాటు నీళ్లల్లో బిస్కెట్‌ కూడా పెడితే చక్కగా తిన్నాడని తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్ష కోసం బాబుని ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించగా..మృతురాలి భర్త పని మీద ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాడని, అతడి రాక కోసం ఎదరుచూస్తున్నామని ఓ పోలీసులు అధికారి తెలిపారు. చనిపోయిన మహిళ కోవిడ్‌తో మరణించిందా లేదా మరేదైనా కారణాలతో చనిపోయిందనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు.