సంక్షోభంలో కమల్ నాథ్ సర్కార్ : బెంగళూరులో 18మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…అవిశ్వాస తీర్మాణానికి బీజేపీ రెడీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 9, 2020 / 01:48 PM IST
సంక్షోభంలో కమల్ నాథ్ సర్కార్ : బెంగళూరులో 18మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…అవిశ్వాస తీర్మాణానికి బీజేపీ రెడీ

మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్‌నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ కు చేరుకున్నారు. భోపాల్ నుంచి మూడు ప్రత్యేక ఫ్లైట్‌లో వీరిని జాగ్రత్తగా తరలించినట్లు సమాచారం. వీరందరూ కూడా రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు సమాచారం. ఈ రెబెల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం. మొత్తం230సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 114,బీజేపీకి107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ 18మంది కమల్ నాథ్ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

సూత్రధారి సింధియా 

అయితే ఈ మొత్తం వ్యూహానికి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియానే కారణమని సమాచారం. ఈ 18 మందిలో అత్యధికులు ఈయన వర్గం వారే కావడం విశేషం. ఇంత జరుగుతున్న ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ 18 మంది  రెబెల్స్ గా మారడంతో ప్రతిపక్ష బీజేపీ మధ్యప్రదేశ్ శాసనసభలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి కమల్ నాథ్

మరోవైపు ఈ సంక్షోభంపై ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోమవారం ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ…మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిస్థితి గురించి సోనియాతో చర్చించాం. ప్రస్తుతం ఏం చేయాలన్న దానిపై సోనియా తనకు మార్గదర్శనం చేశారని, దానిని అమలు చేస్తానని కమల్‌నాథ్ ప్రకటించారు. అయితే ఇవాళ కమల్ నాథ్ తో సోనియాను కలిసిన వారిలో జ్యోతిరాధిత్య సింధియా లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా సింథియా అంతర్గత విబేధాల గురించి కమల్ నాథ్ ని మీడియా ప్రశ్నించగా…ప్రశ్నను దాటేసే ప్రయత్నం చేశారు కమల్ నాథ్.

ఎమ్మెల్యే రాజీనామా

గత శుక్రవారం సువర్శ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దీప్ సింగ్ దంగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండవసారి తాను ప్రజల ఆమోదం పొంది ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన పట్ల పార్టీ తరచుగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని తన రాజీనామా లేఖలో హర్దీప్ దంగ్ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వంలో భాగమైనందున మంత్రులు ఎవరూ పనిచేయడానికి సిద్ధంగా లేరని తన లేఖలో హర్దీప్ తెలిపారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ మొదటగా ఆకర్షించిన 10మంది ఎమ్మెల్యేలలో హర్దీప్ ఒకరు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 121 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి 107 మంది సభ్యుల ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 116మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 114సీట్లు రాగా ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు,ఒక ఎస్పీ ఎమ్మెల్యే,నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓ కాంగ్రెస్,ఓ బీజేపీ ఎమ్మెల్యే మరణంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ లో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటకలో మాదిరిగా జరిగినట్లయితే అతిత్వరలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కమల్ నాథ్ ఇంటికి దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉన్నట్లుండి మారిపోవడంతో మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోమవారం సాయంత్రం భోపాల్ లోని సీఎం కమల్ నాథ్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా కమల్ నాథ్ తో దిగ్విజయ్ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.