ఆజాంఘర్‌ : పోలీసులపై రాళ్ల దాడి ఘనటలో 19 మంది అరెస్ట్‌

10TV Telugu News

పౌరసత్వ చట్ట సవరణపై దేశ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఆజాంఘర్‌ జిల్లాలోని బిలారియగంజ్ వద్ద  సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కు..డిమాండ్ చేసే హక్కు మాకు ఉంది దాన్ని అణిచివేయటానికి పోలీసులు రావటమేంటి? అంటూ పోలీసులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. 

దీంతో పోలీసులు ఉలేమా కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శితో సహా 19 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం (ఫిబ్రవరి 5,2020)న వెంటాడి మరీ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న  ఉలేమా కౌన్సిల్ నాయకులు నూరుల్ హోడా, మీర్జా షేన్ ఆలం, ఒసామాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను పట్టి ఇచ్చినా..వారి సమాచారం చెప్పినావారికి  ఒక్కొక్కరికి రూ .25 వేల రివార్డు ఇస్తామని  పోలీసులు ప్రకటించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి సింగ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉందన్నారు. కొంతమంది మహిళలు..చిన్నారులతో కలిసి గుంపులుగా ఏర్పడి  సీఏఏకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ విషయంపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. ఇంతలో అక్కడికి చేరుకున్న 19 మంది వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారని.. వారిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 

జనాలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించాల్సి వచ్చిందనీ తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు, చిన్నారులు సురక్షితంగానే ఉన్నారని స్పష్టంచేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న 100 మంది తెలియని వ్యక్తులతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో పేరుపొందిన మరో 16 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. 
కాగా..సీఏఏకు వ్యతిరేకిస్తు నిరసన తెలిపేందుకు వందలాది మంది మహిళలు మంగళవారం బిలారియాగంజ్‌లోని మౌలానా జౌహర్ పార్కుకు చేరుకుని నిరసన చేపట్టిన క్రమంలో ఈ ఘటన జరిగింది.