రాజస్తాన్ లో మళ్లీ రాజకీయ అలజడి

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2020 / 11:13 PM IST
రాజస్తాన్ లో మళ్లీ రాజకీయ అలజడి

2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్‌ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్‌లోని గహ్లోత్‌‌ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీటీపీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి రాజస్తాన్‌ కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

కాగా, ఈ ఏడాది ఆగస్టులో సచిన్‌ పైలట్‌ తన అనుచర వర్గంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం బుజ్జింపులతో సచిన్ పైలట్ మొత్తబడటంతో గెహ్లాట్ సర్కార్ కి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.

అయితే, ఇటీవల రాజస్తాన్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్‌ బీజేపీతో చేతులు కలిపిందని BTP ఆరోపించింది. 27 స్థానాలు గల దుర్గాపుర్‌ జిల్లాలో కేవలం 8 స్థానాలు గల బీజేపీ, జిల్లా ప్రముఖ్‌ స్థానాన్ని ఎలా గెలుచుకుంటుందని, ఇది కాంగ్రెస్‌ , బీజేపీ చీకటి ఒప్పందంని విమర్శించింది. ఇది నమ్మక ద్రోహమని వ్యాఖ్యానించింది.

మరోవైపు,పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవిచూసింది. పంచాయితీ ఫలితాలతో రాజస్తాన్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్‌ ఆలోచిస్తుంది. రాజస్తాన్‌లోని 222 పంచాయతి సమితిలోని 4371 సీట్లలో ఎన్నికలు జరగగా అధికార కాంగ్రెస్‌ పార్టీ 1852 గెలుచుకోగా, బీజేపీ 1989 సీట్లలో గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 439 సీట్లలో గెలుపొందారు. 21 జిల్లా పరిషత్‌లో జరిగిన ఎన్నికల్లో 14 స్థానాలలో బీజేపీ తన అధ్యికతను ప్రదర్శించింది. బీజేపీ 353, కాంగ్రెస్‌ 252, ఆర్‌ఎల్‌పీ 10, సీపీఐ-ఎం 2, స్వతంత్రులు 18 స్థానాలలో గెలిచారు. గత నెలలో జరిగిన ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 4 స్థానాలు కైవసం చేసుకుంది.