రక్త మరిగిన రహదారులు..20మంది బలి!!

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 10:39 AM IST
రక్త మరిగిన రహదారులు..20మంది బలి!!

రక్త మరిగిన రహదారులు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని వేదనను మిగులుస్తున్నాయి. ఆత్మీయులను పోగొట్టుకుని ఆవేదనకుగురవుతున్న కుటుంబాలు ఎన్నో..ఎన్నెన్నో. మద్యం సేవించి వాహనాలు నడపటం..అతి వేగం. నిర్లక్ష్యం, నిద్రలేమి  ఇలా కారణం ఏదైనా మనుషుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ ఉండదు అంటి అతిశయోక్తి కాదు. ఎక్కడోకచోట ఏదోక ప్రమాదం జరగుతునే ఉంటుంది. ఎన్నో కుటుంబాలు కుమిలిపోతునే ఉంటున్నాయి. దాదాపు అన్ని ప్రమాదాల్లో ప్రాణాలు పోవటం జరుగుతోంది. ఈక్రమంలో శనివారం (మార్చి 14,2020) ఒక్కరోజే రాజస్థాన్..మహారాష్ట్ర, తమిళనాడుల్లో   20మంది చనిపోయారు. 

రాజస్థాన్ లో ట్రక్కు-బొలేరో ఢీకొని 11మంది మృతి 
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

తమిళనాడు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి 
అలాగే తమిళనాడులోని నామక్కల్‌లో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నామక్కల్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.  మృతులను బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

మహారాష్ట్రలో ముగ్గురు బలి
ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వోర్లీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కారు నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఇలా దేశంలో ఏదోక మూల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆందోళనలకు గురిచేస్తోంది. బైటకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి తిరిగివస్తోరో లేదోననే ఆందోళన కలుగుతోంది. 

Also Read | కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, ఒక్కొక్కరికి రూ.4లక్షలు