Congress-2023: కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా 2023.. ఏమాత్రం పట్టు తప్పినా పార్టీ గోతిలో పడ్డట్టే

Congress-2023: కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా 2023.. ఏమాత్రం పట్టు తప్పినా పార్టీ గోతిలో పడ్డట్టే

2023 very crucial to congress party

Congress-2023: 2023 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మెడపై కత్తిలా కనిపిస్తోంది. 2014 అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఆనాటి నుంచి పడ్డ స్థాయిలోనే పడుతూ లేస్తూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దాదాపుగా అదే తీరు కనిపించింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోవడమే కాకుండా, యూపీఏలోని పక్షాలను సైతం దూరం చేసుకుంటూ వస్తోంది. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా నిల్చోవడం మాట అటుంచితే.. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్థానిక పార్టీల ముందు కూడా నిలువలేని స్థితికి చేరుకుంది.

Bharat Jodo Yatra: ముగింపు దశలో భారత్ జోడో యాత్ర.. రెండవ విడత ప్రియాంకతో కొనసాగించే ప్లాన్‭లో కాంగ్రెస్

అయితే బీజేపీ తర్వాత దేశంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనిపిస్తోంది. బీజేపీ తర్వాత 20 శాతం ఓట్ బ్యాంక్ ఒక్క కాంగ్రెస్ వద్దే ఉంది. మరో ఏడెనిమిది పార్టీలు జాతీయ పార్టీలుగా పేరు పొందినప్పటికీ ఆ పార్టీల వద్ద 6 శాతం ఓట్ బ్యాంకు కూడా లేదు. ఈ విధంగా చూసుకుంటే బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెసే అనే వాదనలు వినిపించినప్పటికీ.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీని కైవసం చేసుకున్నప్పటికీ.. కీలమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది.

ఇక అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలను సైతం హార్స్ రేడింగులో కోల్పోతూ వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే జరిగింది. వీటి అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. అప్పటికి మిగిలింది రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాలే. తాజా ఎన్నికల్లో హిమాచల్ చేతిలోకి వచ్చినప్పటికీ.. అది చాలా చిన్న రాష్ట్రం. ఇక జార్ఖండ్‭లో అధికార పొత్తులో కాంగ్రెస్ ఉంది కానీ, అధికారం కాంగ్రెస్ పార్టీది కాదు.

Congress Hope: జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అధికారంపై రాహుల్ విశ్వాసం

ఎటొచ్చీ రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ యేడాది ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు కాంగ్రెస్ బలంగా ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే ఏడాది. ఈ రాష్ట్రంలో అధికారం మాట అటుంచితే బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది.

రాజస్థాన్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం వైపుకు అడుగులు వేసి తెలంగాణలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటేనే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. లేదంటే సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కాలగమనంలో కలిపోయే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ఆప్ వంటి పార్టీలు చాలా వేగంగా ఎదుగుతూ బీజేపీ ప్రత్యామ్నాయానికి ప్రయత్నిస్తున్నాయని, వేరే ఎవరికీ ఆ అవకాశం ఇవ్వొద్దంటే ఈ యేడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తీరు మెరుగు పడాలని అంటున్నారు.

Bharat Jodo Yatra: గడ్డకట్టే చలిలో చొక్కాలు విప్పేసి డాన్సులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు