సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

  • Edited By: madhu , January 4, 2019 / 12:54 AM IST
సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి విపక్షాలు ఆందోళనలు..నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ చెప్పడం..సభ్యులు వినిపించుకోకుండా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుకోవడం పరిపాటై పోయింది. 
టీడీపీ ఎంపీల సస్పెన్షన్…
జనవరి 03వ తేదీ గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు తమ గళం విప్పారు. స్పీకర్‌ ఎంత చెప్పినా వినకుండా పొడియం వద్దే ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌- సభా కార్యక్రమాలకు భంగం కలిగిస్తున్నారన్న కారణంతో 374 ఏ నిబంధన కింద టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు.  తొలుత ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీ మోహన్‌, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌ రెడ్డి, శ్రీరాం మల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.
అన్నాడీఎంకే సభ్యుల సస్పెన్షన్…
2గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, పండుల రవీంద్రబాబు నినాదాలు కొనసాగించడంతో వారినీ స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందంపై చర్చ సందర్భంగా అన్నాడిఎంకె సభ్యులను సభను అడ్డుకున్నారు. కావేరీ జలాలపై హంగామా సృష్టించడంతో 24 మంది అన్నాడిఎంకె ఎంపీలను ఐదు రోజుల పాటు స్పీకర్‌ సస్పెన్షన్‌ విధించారు. పార్లమెంట్‌ సమావేశాలు జనవరి 8తో ముగియనున్నాయి.