ఆందోళనలు ఉధృతం…రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

ఆందోళనలు ఉధృతం…రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

24-hour relay hunger strike నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో నాలుగు వారాలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తోన్న విషయం చేసింది. ఆందోళనకారులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. రైతు చట్టంలో పలు సవరణలకు కేంద్రం ప్రతిపాదిస్తుండగా..సవరణలు వద్దు చట్టాల రద్దే కావాలంటూ రైతులు సృష్టం చేయడంతో పలు దఫాలుగా ప్రభుత్వం రైతులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

అయితే,నాలుగు వారాలుగా కొనసాగిస్తున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 24గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్​ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 11మంది సభ్యుల బృందం.. సింఘూ సిరిహద్దులో ఈ దీక్షను ప్రారంభించనున్నట్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలను ఆయా నిరసన ప్రదేశాలలో ఒక రోజు నిరాహార దీక్ష పాటించాలని యాదవ్ కోరారు.

ఈనెల 23న ‘కిసాన్​ దివస్​’ సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కోరారు. ఈనెల 25 నుంచి 27 వరకు హర్యాణాలో టోల్​ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోడీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించాలని అభ్యర్థించారు.

కాగా, నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి ఉద్యమంలో భాగంగా చనిపోయిన రైతులకు.. నివాళులు అర్పించారు. రైతు అమరవీరులకు గుర్తుగా శ్రద్ధాంజలి దివస్​ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. సింఘూ, టిక్రీ, ఘాజిపుర్​ వద్ద రైతు సంఘాల నేతలు, రైతులు సంతాపం ప్రకటించారు. ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాత వివిధ కారణాలతో 33 మంది రైతులు మరణించిన విషయం తెలిసిందే.

మరోవైపు, రైతు సంఘాల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ సోమవారం లేదా మంగళవారం సమావేశం అవుతారని హోం మంత్రి అమిత్​ షా తెలిపారు. బంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.