రైల్వే శాఖ బంపర్ ఆఫర్ : టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ 

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : August 28, 2019 / 07:54 AM IST
రైల్వే శాఖ బంపర్ ఆఫర్ : టికెట్లపై 25 శాతం డిస్కౌంట్ 

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత రైల్వే టికెట్ల ధరలపై 25శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దూరప్రాంతాలకు వెళ్లే చాలామంది ప్రయాణికులు ఎక్కువగా రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తుండటంతో రైళ్లలో చాలా సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. దీంతో రైల్వే శాఖ ఈ దిశగా నిర్ణయాన్ని ప్రకటించింది. శతాబ్ది ఎక్స్ ప్రెస్, గతిమాన్ ఎక్స్ ప్రెస్, తేజస్ ఎక్స్ ప్రెస్, డబుల్ డెక్కర్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఏసీ క్లాస్, చైర్ కార్ క్లాసుల్లో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లపై డిస్కౌంట్ వర్తిస్తుంది.

దీనికి సంబంధించి రైల్వే అన్ని జోనల్ మేజనర్లకు సర్క్యూలర్ కూడా జారీ చేసినట్టు సీనియర్ రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ రూల్ ప్రకారం.. రైల్వే ప్రయాణికులు 50శాతం కంటే తక్కువ సీట్లు బుక్ అయిన రైళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రైళ్లలో టికెట్ బేస్ ఫేర్ పై 25శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. జోనల్ రైల్వేలోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ట్రైన్ వెళ్లే మార్గం ఆధారంగా టికెట్లపై డిస్కౌంట్ శాతాన్ని నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటారు. ఏ రైలు ఎంపిక చేసుకున్నారు.. ఏ మార్గంలో వెళ్తుంది అనే దానిపై కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. 2018 ఏడాదిలో రైలు ఆక్యుపెన్సీ ఆధారంగా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చినట్టు అధికారి తెలిపారు.

డిస్కౌంట్ ఛార్జీలను పూర్తి సంవత్సరం లేదా ఒక సంవత్సరం, లేదా నెల వారీగా లేదా కాలానుగుణంగా లేదా వారం రోజులు లేదా వారాంతాల్లో ఇవ్వవచ్చు. ‘రైలు వెళ్లే మొత్తం మార్గంలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటే లేదా ఏదైనా రెండు ప్రత్యేక స్టేషన్ల మధ్య తక్కువగా ఉంటే, ఆ ప్రాతిపదికన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది’ అని సర్య్కూలర్ తెలిపింది. 

ఢిల్లీ నుంచి లక్నో వెళ్లే కాన్పూర్ -లక్నో శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో సీట్లు ఎక్కువ శాతం సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని రైల్వే అధికారి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ ప్రయాణికుల టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తుందన్నారు. ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్లే అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో జైపూర్ నుంచి అజ్మీర్ మధ్యలో సీట్లు ఎక్కువగా ఖాళీగా ఉంటున్నాయి. జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్లే మార్గంలో వోల్వో బస్సు సర్వీసులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే ఎక్కువ మంది ప్రయాణికులు తొలి ప్రాధాన్యత బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్ట పడుతున్నారని అధికారి తెలిపారు.

దీనిపై దృష్టిపెట్టిన రైల్వే శాఖ వ్యూహాత్మక ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు  టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వోల్వో బస్సులు వెళ్లే మార్గాల్లో తక్కువ ధరకే రైల్వే టికెట్లు ఆఫర్ చేస్తోంది. రైళ్లల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఆయా మార్గాల్లో 10శాతం ధర లేదా ఫిక్సడ్ రేట్లను అందిస్తోంది.

ఇప్పటివరకూ చెన్నై-మైసూర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, బెంగళూరు-మైసూర్ సెక్షన్ రైళ్లల్లో, ఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, జైపూర్-అజ్మీర్, ఢిల్లీ-లక్నో శతాబ్ది ఎక్స్ ప్రెస్, కాన్పూర్-లక్నో మధ్య, న్యూ జల్పాయిగుడి-హౌరా శతాబ్ది ఎక్స్ ప్రెస్, మాల్దా-న్యూ జల్పాయిగుడి మధ్య రైల్వే సర్వీసుల్లో మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తోంది.

ఈ పైలట్ ప్రాజెక్టును ఏసీ చైర్ కార్ కోచ్ లతో పాటు అన్ని రైళ్లల్లో అమల్లోకి తీసుకురానున్నారు. అన్ని జోనల్ రైళ్లల్లో తక్కువ ఆక్యూపెన్సీ ఉన్న రైళ్లను గుర్తించి సెప్టెంబర్ 30 నాటికి వివరాలను సమర్పించాల్సిందిగా సర్య్కూలర్ తెలిపింది.