Brave Children: 29 మంది బాలబాలికలకు “పీఎం బాల-పురస్కార్ అవార్డులు” అందజేత

చిన్నారుల్లో ప్రతిభ, సాహసాలను మెచ్చి ప్రతి ఏటా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం వర్చువల్ పద్దతిలో జరిగింది.

Brave Children: 29 మంది బాలబాలికలకు “పీఎం బాల-పురస్కార్ అవార్డులు” అందజేత

Bala Purskar

Brave Children: చిన్నారుల్లో ప్రతిభ, సాహసాలను మెచ్చి ప్రతి ఏటా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అవార్డుల కార్యక్రమం సోమవారం వర్చువల్ పద్దతిలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈకార్యక్రమంలో పాల్గొని.. ఆపత్కాలంలో సాహసాన్ని కనబరిచిన బాలబాలికలకూ మరియు వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన 29 మంది బాలలకు పురస్కారాలు అందజేశారు. మొత్తం 29 మందికి గానూ 14 మంది బాలికలు.. ఆవిష్కరణ, పాండిత్య సాధన, క్రీడలు, కళలు మరియు సంస్కృతి, సామాజిక సేవ మరియు ధైర్యసాహసాల విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు. పీఎం బాల-పురస్కార్ అవార్డు అందుకున్న అతి పిన్న వయసున్న బాలిక.. ఐదేళ్ల ధృతీష్మాన్ చక్రవర్తి ఐదు భాషల్లో అనర్గళంగా పాటలు పాడగలదు.

Also read: Israel – India: భారత్ లో యూదులు ఎన్నడూ వివక్షకు గురికాలేదు: ఇజ్రాయెల్

ఇక ఆంధ్రప్రదేశ్ లోని సిక్కోలుకు చెందిన గురుగు హిమప్రియా.. ధైర్యసాహసాల విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ అందుకుంది. హిమప్రియా తండ్రి గురుగు సత్యనారాయణ ఒక ఆర్మీ జవాన్. 2018లో జమ్మూకాశ్మీర్ లో నివసిస్తున్న సమయంలో వీరు నివాసముంటున్న ప్రాంతంపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో హిమప్రియా తల్లి గాయపడగా.. తల్లితో సహా.. ఆర్మీ కాలనీలోని మరికొందరిని హిమప్రియా ప్రాణాలకు తెగించి కాపాడింది.

ఇక పీఎం బాల-పురస్కార్ అవార్డు అందుకున్న వారిలో.. రెమోనా ఎవెట్ పెరీరా (16) భరత నాట్యం, గౌరీ మహేశ్వరి (13) కాలిగ్రఫీ, సయ్యద్ ఫతీన్ అహ్మద్(13) పియానో పోటీలు, శివంగి కాలే (6) ధైర్యసాహసాలు, ధీరజ్ కుమార్ (14) మొసలితో పోరాటం, పుహాబి చక్రవర్తి (15) ఆవిష్కరణ, అభినవ్ కుమార్ చౌదరి (16) ఆవిష్కరణలు..ప్రధానంగా నిలిచారు. వీరికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో అవార్డు సర్టిఫికెట్ అందజేసి రూ.1 లక్ష నగదు పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ బాలల ప్రతిభను సాహసాలను ప్రశంసించారు.

Also read: Dangerous Traveler: విమాన చక్రాలను పట్టుకుని 11 గంటలపాటు గాల్లోనే ప్రయాణించిన వ్యక్తి