ఈ ఆటోడ్రైవర్ మానవత్వానికి కర్నాటక రాష్ట్రమే హ్యాట్సాప్ అంటోంది

  • Published By: vamsi ,Published On : May 15, 2019 / 08:50 AM IST
ఈ ఆటోడ్రైవర్ మానవత్వానికి కర్నాటక రాష్ట్రమే హ్యాట్సాప్ అంటోంది

రోజూ ఆటో నడిపితేనే పూట గడిచేది. అయితేేనేం మానవత్వంలో అతను చాలా గొప్పవాడు. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ మానవత్వానికి ప్రతిరూపం అని గుర్తింపు పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు ముద్రప్ప. వృత్తి ఆటో నడపడం. పెద్దగా డబ్బులేమీ లేవు. 2019 ఏప్రిల్ 15వ తేదీ బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ఏరియాలో రాత్రి సమయంలో ఓ గర్భిణి కనబడింది. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఎవరూ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

దీంతో తన ఆటోలో ఎక్కించుకున్న ముద్రప్ప.. స్థానిక వైదేహీ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడి డాక్టర్ల సూచనతో.. సీవీ రామన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేశాడు. ఆమె పేరు నందిత అని, ఆమె సంబంధీకులు ఎవరో తెలియదని చెప్పిన ముద్రప్ప కేర్ టేకర్‌గా తన పేరు, నంబర్ ఇచ్చి ట్రీట్ మెంట్ చేయించాడు. హాస్పిటల్‌లో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అయితే ముద్రప్ప ఇంటికి వెళ్లి వచ్చేసరికి హాస్పిటల్‌లోని ఆ మహిళ.. ఆడ బిడ్డను వదిలేసి పారిపోయింది.

ఆ పరిస్థితుల్లో బిడ్డను దిక్కులేకుండా వదిలేయడం ముద్రప్పకు నచ్చలేదు. నెలలు నిండకముందే పుట్టడంతో బిడ్డకు కొద్దిరోజులు చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. అందుకు ఒప్పుకున్న ముద్రప్ప బిడ్డకు తన సొంత ఖర్చులతో ట్రీట్ మెంట్ చేయించాడు. రోజంతా ఆటో నడపిన డబ్బులను హాస్పిటల్‌లో బిడ్డను చూసుకునేందుకు ఖర్చుపెట్టాడు. అయితే 18 రోజుల తర్వాత బిడ్డ చనిపోయింది.

దీంతో బాదపడ్డ ముద్రప్ప.. బిడ్డ గురించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేశాడు. ఆ బిడ్డ తల్లిని వెతికి.. బిడ్డ చనిపోయిందనే సమాచారం ఇవ్వాలని కోరాడు. అనంతరం పోలీసుల సహాయంతో ఆ బిడ్డకు అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ విషయం పోలీసుల ద్వారా.. మీడియాకు తెలిసింది. మంచి మనసున్న ఆటో డ్రైవర్ ముద్రప్ప కథనాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. తనకు ఆ బిడ్డ ఎవరో తెలియకపోయినా.. సొంత బిడ్డే అనుకున్నాననీ, తనకు అప్పటికే ఇద్దరు పాపలు ఉన్నారనీ, అయినా పాపను పెంచుకుందామని చెప్తే తన భార్య ఒప్పుకుందని చెప్పారు. కాగా ముద్రప్ప మానవత్వానికి సోషల్ మీడియా హ్యాట్సాఫ్ చెబుతుంది.