మేము సైతం తరలివస్తాం: IITలకు పాకిన CAA సెగలు

మేము సైతం తరలివస్తాం: IITలకు పాకిన CAA సెగలు

ఐఐటీల్లోని విద్యార్థులు ఆందోళనలకు సహజంగానే దూరంగా ఉంటారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చూపించిన వైఖరికి దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో వ్యతిరేకత మొదలైంది. జామియా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై జరిపిన దాడి పట్ల IIT మద్రాస్‌, IIT ముంబై, IIT కాన్పూర్‌ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. 

‘జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనను అణచి వేశారు. మేం స్పందించలేదు. ఎంటెక్‌ ఫీజులు పెంచేశారు. మేం స్పందించలేదు. జేఎన్‌యూలో విద్యార్థులపై చెయ్యి చేసుకున్నారు. మేం స్పందించలేదు. ఇప్పుడు జామియా, అలీగఢ్‌ వర్సిటీలపైకి వస్తున్నారు. ఇప్పుడు కూడా మనం స్పందించకపోతే విద్యార్థుల ఐక్యతే ప్రమాదంలో పడుతుంది. అందుకే, జామియా, అలీగఢ్‌ విద్యార్థులకు సంఘీభావం ప్రకటిద్దాం’ అంటూ కాన్పూర్‌ ఐఐటీ వద్ద పోస్టర్‌ ఏర్పాటు చేశారు.

క్యాంపస్ వ్యాప్తంగా విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదే సమయంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు గజేంద్ర సర్కిల్ వద్దకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. వీరితో పాటుగా బెంగళూరులోని ఐఐఎం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, ఐఐఎం అహ్మదాబాద్‌, వారాణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ వర్సిటీ, ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) తదితర ప్రాంతాల్లో పెద్దెత్తున విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ సోమవారం రణరంగాన్ని తలపించింది. వందలాదిమంది విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. 21 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. యూపీలోని మావ్‌లో ఆందోళనకారులు 15 వాహనాలకు నిప్పు పెట్టారు.