Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్‌పాయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజే సింథియా, వీహెచ్‌పీ నేతలు గిరిరాజ్ కిశోర్, అశోక్ సింఘాల్, శివ సేన చీఫ్ బాల్ థాకరే, ఆరెస్సెస్ మాజీ నేత కేఎన్ గోవిందాచార్య తదితరులు నిందకు అర్హులేనని తెలిపింది.

Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

30 years after Babri Masjid demolition

Babri Masjid: సరిగ్గా 30 ఏళ్ల క్రితం.. 1992, డిసెంబర్ 6న కొంత మంది రైట్ వింగ్ కార్యకర్తలు చేతిలో ఆయుధాలతో అయోధ్యలోని బాబ్రీ మసీదుపైకి దాడికి దిగారు. మసీదును విధ్వంసం చేస్తూ అయోధ్యలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ప్రదేశంలో రామాలయం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారనే ఏళ్ల నాటి వివాదాన్ని.. 30 ఏళ్ల క్రితం జరిగిన విధ్వంసం మరో మలుపుకు తీసుకెళ్లింది. ఇక ఆనాటి నుంచి బాబ్రి మసీదు అంశం దేశ వ్యాప్తంగా రోజువారి చర్చలో భాగమైంది. రాజకీయాలకు మొదటి పావుగా మారింది. ఇరు వర్గాల వాదనలు, ప్రతివాదనల నడుమ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రమేయంతో మసీదు స్థలాన్ని హిందువులకు కేటాయించాలని తీర్పు వచ్చింది. ఆ రోజుతో సమస్యకు దాదాపు ముగింపు లభించినట్టైంది. కాకపోతే, అప్పుడప్పుడు చర్చలో మాత్రం రగులుతూనే ఉంటుంది.

బాబ్రీ మసీదు నిర్మాణం, వివాదం..
1528లో మొఘల్ చక్రవర్తి బాబార్ ఆదేశాల మేరకు అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. చాలా కాలం వరకు ఇందులో ప్రార్థనలు జరిగాయి. అయితే మూడు శతాబ్దాల అనంతరం మసీదు నిర్మించిన ప్రాంతంలో రామమందిరం ఉండేదని, అది కూల్చి మసీదు నిర్మించారనే వాదనలు పైకి లేచాయి. ఈ విషయమై అయోధ్యలో హిందూ-ముస్లింల మధ్య 1855లో మొదటిసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ వాదనల నేపథ్యంలో 1859లో బ్రిటిష్ పాలకులు ఈ మసీదు చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, మసీదు వెలుపల హిందువులకు పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ పూజలను 1885లో స్థానిక కోర్టు తోసిపుచ్చింది.

World Largest Radio Telescope : ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ నిర్మాణం..

1934లో హిందూ-ముస్లింల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో ఈ మసీదు డోమ్ దెబ్బతిన్నది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దీని పునర్నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇక 1947లో ఈ మసీదుపై అధికారం సున్నీ వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉందని, షియా వక్ఫ్ బోర్డుకు లేదని స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ మసీదులో హిందూ మహాసభ సభ్యులు పెట్టిన విగ్రహాలను తొలగించేందుకు ఆదేశించబోనని జిల్లా మేజిస్ట్రేట్ 1949 డిసెంబరు 22న తీర్పు చెప్పారు. ఆ తర్వాత ఈ మసీదుకు తాళాలు వేశారు.

1984లో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‭కే అద్వాణీ నాయకత్వంలో చేపట్టిన రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో రైట్ వింగ్ సంస్థల నుంచి పూర్తి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో 1986లో మసీదు తలుపులు తెరిచి పూజలు చేసుకోవడానికి హిందువులకు అనుమతి లభించింది. రామాలయం కోసం శిలాన్యాసం చేయడానికి వీహెచ్‌పీకి 1989 నవంబరు 9న అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక 1990 సెప్టెంబర్ 25న ఎల్‭కే అద్వాణీ చేపట్టిన రథయాత్ర ఈ వివాదాన్ని మరోవైపుకు తీసుకెళ్లింది.

Maha vs Karnataka: మమ్మల్ని కర్ణాటక రాష్ట్రంలో కలిపేయండి.. మహా ప్రభుత్వానికి షాకిస్తూ లేఖ రాసిన 11 గ్రామాలు

1992 డిసెంబరు 6న బీజేపీ సహా ఇతర హిందూ సంఘాలు రామమందిరం కోసం బాబ్రీ మసీదు వద్ద సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు వచ్చిన జనాలు ఉన్నట్లుండి మసీదులోకి దూసుకెళ్లారు. కొద్ది గంటల్లోనే దానిని కూల్చేశారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. సభకు ముందు మసీదుకు ఎటువంటి నష్టం జరగనివ్వబోమని సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీని నెరవేర్చుకోలేకపోయింది. ఇక అనంతరం దేశంలో జరిగిన పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. దేశవ్యాప్తంగా సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు లాల్ కృష్ణ అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ తదితరులపై కేసులు నమోదు చేశారు. అప్పుడు యూపీలో అధికారంలో ఉన్న కల్యాణ్ సింగ్ నేతృత్వకంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది.

బాబ్రీ వివాదంపై కోర్టు తీర్పులు
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ సీఎంగా ఉన్న కల్యాణ్ సింగ్‌ను అపరాధిగా సుప్రీంకోర్టు 1994లో నిర్థరించింది. అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్‌పాయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమా భారతి, విజయరాజే సింథియా, వీహెచ్‌పీ నేతలు గిరిరాజ్ కిశోర్, అశోక్ సింఘాల్, శివ సేన చీఫ్ బాల్ థాకరే, ఆరెస్సెస్ మాజీ నేత కేఎన్ గోవిందాచార్య తదితరులు నిందకు అర్హులేనని తెలిపింది.

Mukhachitram: సెన్సార్ పనులు ముగించుకున్న విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’..!

2010లో వివాదాస్పద మసీదు ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో రెండొంతులు హిందూ పిటిషనర్లకు, మిగిలిన ఒక వంతు సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. అయితే ఇరు వర్గాలు ఇందుకు ఒప్పుకోకపోవడంతో 2011లో తీర్పును అదే కోర్టు నిలిపివేసింది. ఈ విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2016లో సుప్రీంను ఆశ్రయించారు. దశల వారీగా జరిగిన విచారణ అనంతరం, 2019 నవంబరు 9న బాబ్రీ మసీదు స్థలాన్ని పూర్తిగా హిందువులకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్మానం చేసింది. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ స్థలంలో ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది.

ఇక బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వాణీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్ సింగ్ సహా ఇతరులకు ఉపశమనం లభించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు 2020 సెప్టెంబర్ 30న వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. అదే ఏడాది ఆగస్టు 5న మసీదు కూల్చిన ప్రాంతంలోనే రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేశారు. 2024 లోక్‭సభ ఎన్నికల లోపు నిర్మాణం పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Maharashtra: మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. ఇప్పట్లో విస్తరణ లేనట్టేనట!