5 రాష్ట్రాలు, 84 గంటలు, 3వేల కిమీ ప్రయాణం.. చెన్నై టు ఐజ్వాల్, స్నేహితుడి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు

  • Published By: chvmurthy ,Published On : April 29, 2020 / 06:00 AM IST
5 రాష్ట్రాలు, 84 గంటలు, 3వేల కిమీ ప్రయాణం.. చెన్నై టు ఐజ్వాల్, స్నేహితుడి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అన్నీ బంద్ అయ్యాయి. రవాణ వ్యవస్థ నిలిచిపోయింది.  ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసరం అయితే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అది కూడా పోలీసుల పర్మిషన్ మస్ట్. లాక్ డౌన్ కారణంగా కొన్ని  కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రక్త సంబంధం ఉన్న వారు చనిపోతే కడచూపు కూడా దక్కడం లేదు. చివరి చూపు లేకుండానే అంత్యక్రియలు  జరిగిపోతున్నాయి.
 

ఊరు కాని ఊరులో అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి తన బెస్ట్ ఫ్రెండ్ కోసం సాహసం చేశాడు.  స్నేహితుడు చనిపోతే అతడి మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. ఇందుకోసం అతను చాలా రిస్క్ చేశాడు. 5 రాష్ట్రాల మీదుగా 84 గంటల పాటు 3వేల  కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి స్నేహితుడి మృతదేహాన్ని అతడి ఇంటికి చేర్చాడు. 

గుండెపోటుతో చెన్నైలో మృతి:
మిజోరాం రాష్ట్రానికి చెందిన వివియన్ అనే వ్యక్తి హోటల్ మేనేజ్ మెంట్ చేస్తున్నాడు. ఇందుకోసం మిజోరాం నుంచి 2015లో తమిళనాడు రాజధాని చెన్నై  వెళ్లాడు. అయితే వివియన్ గుండెపోటుతో అకాల మరణం చెందాడు. అయితే అతడికి చెన్నైలో బంధువులు లేరు. తల్లిదండ్రులు, బంధువులు అంతా  మిజోరాం రాష్ట్రంలోనే ఉన్నారు. లాక్ డౌన్ కావడంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీనిపై చెన్నైలో ఉన్న మిజోరాం వెల్ఫేర్  అసోసియేషన్ స్పందించింది. మృతదేహాన్ని స్వస్థలమైన మిజోరాం పంపేందుకు ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం అంబులెన్స్  మాట్లాడింది. ఇద్దరు డ్రైవర్లు అంబులెన్స్ నడిపేందుకు ముందుకు వచ్చారు. అయితే వివియన్ మృతదేహాన్ని తరలించాలంటే కచ్చితంగా బంధువు  ఉండాలి. అయితే చెన్నైలో వివియన్ బంధువులు లేరు. 

ప్రాణ స్నేహితుడి ఆఖరి కోరిక తీర్చాడు:
ఈ సమయంలో వివియన్ ప్రాణ స్నేహితుడు మల్చన్ హిమా నేనున్నా అంటూ ముందుకొచ్చాడు. నేను చనిపోతే నా సొంతూరు మిజోరాంలోనే  అంత్యక్రియలు జరపాలని వివియన్ చెప్పేవాడట. దీంతో మల్చన్ హిమా మృతదేహం వెంట వెళ్లేందుకు ముందుకొచ్చాడు. అంబులెన్స్ రెడీ అయ్యింది.  ప్రయాణం మొదలైంది.     చెన్నై నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. 5 రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్,  మేఘాలయ, అసోం మీదుగా చివరకు మిజోరాం చేరుకున్నారు. మొత్తం 84 గంటల పాటు 3వేల 345 కిలోమీటర్లు ప్రయాణం సాగింది. చెన్నై టు ఐజ్వాల్  వరకు ప్రయాణం సాగింది. చివరికి వివియన్ ఇంటికి మృతదేహం చేరింది. మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు.

షిప్టుల వారిగా అంబులెన్స్ నడిపిన ఇద్దరు డ్రైవర్లు:
అంబులెన్స్ ను ఇద్దరు డ్రైవర్లు నడిపారు. జయేంద్రన్(41), చిన్నతంబి(51). వారిద్దరూ చాలా సుదీర్ఘంగా అంబులెన్స్ నడిపారు. ప్రయాణం మధ్యలో  ఆహారం, ఇంధనం కోసం మాత్రమే వాహనం ఆపినట్టు చెప్పారు. 8 గంటలు పాటు ఒకరు డ్రైవింగ్ చేశారు. మరో 8 గంటలు మరొకరు డ్రైవింగ్ చేశారు.  జీపీఎస్ ఆధారంగా వారి ప్రయాణం సాగింది.

ఆ ముగ్గురిపై ప్రశంసల వర్షం:
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల సరిహద్దులు మూసివేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.  కరోనా భయాలు తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఓ మృతదేహాన్ని అంత దూరం తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అంబులెన్స్ డ్రైవర్లు,  వివియన్ స్నేహితుడు పెద్ద సాహసమే చేశారని వివియన్ కుటుంబసభ్యులు చెప్పారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. వారి సాహసాన్ని అంతా ప్రశంసించారు. మిజోరాం సీఎం సైతం ట్వీట్ చేశారు. గుండె లోతుల నుంచి వారికి థ్యాంక్స్ చెప్పారు. ఆ ముగ్గురికి సెల్యూట్ చేశారు.