కరోనా బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

  • Published By: bheemraj ,Published On : July 3, 2020 / 07:07 PM IST
కరోనా బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. మృతదేహాలు తరలించే సిబ్బంది, అంబులెన్స్ లపై స్థానికులు దాడులు చేస్తున్నారు. మరోవైపు కొన్ని సందర్భాల్లో కరోనా మృతదేహాలపట్ల సిబ్బంది సరిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల బళ్లారి ఆస్పత్రిలో కరోనాతో మరణించిన 8 మంది మృతదేహాలను ఒకే బ్యాగులో ఉంచిన సిబ్బంది వాటిని ఓ గోతిలోకి విసిరేశారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ.శ్రీరాములు ఈ అంశంపై స్పందించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్ తో ఈ విషయంపై చర్చించారు.

ఉత్తర, దక్షిణ బెంగళూరు, అనెకల్, యలహంక తాలూకాల పరిధిలోని 9 గ్రామాల్లో సుమారు 35.5 ఎకరాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జీఎన్.శివమూర్తి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ఇంత పెద్ద స్థలం కేటాయించడం దేశంలో ఇదే తొలిసారి.