UP Elections : 350 స్థానాల్లో ఎస్పీ విజయం ఖాయం!

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.

UP Elections : 350 స్థానాల్లో ఎస్పీ విజయం ఖాయం!

Akilesh

UP Elections వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా..ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్షాలు వవ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో విజయం తమదేన్న ధీమాతో ఉంది సమాజ్ వాదీ పార్టీ.

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో..వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో 350 సీట్లలో తమ విజయం ఖాయమని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం ప్రధానాంశాలుగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు అఖిలేశ్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కోవిడ్​ పరిస్థితులను ఎదుర్కోవడంలో యోగి సర్కారు పూర్తిగా విఫలమైందన్న అఖిలేష్.. ఆక్సిజన్​, మెడిసిన్, పడకగదులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. గంగానది ప్రక్షాళన, ధరల పెంపు, ఇతర అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారన్నారు.

ఇక, చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఎస్పీ తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ సృష్టం చేశారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా చిన్న పార్టీలన్నీ కలుపుకుని వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, ఇప్పటికే చాలా పార్టీలు ఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. త్వరలో మరిన్ని పార్టీలు తమ వెంట వస్తాయని అఖిలేష్ దీమా వ్యక్తం చేశారు. మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసేందుకు సిద్ధమవుతున్న తన బాబాయ్ శివపాల్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిశీల్​ సమాజ్​వాదీ పార్టీ గురించి స్పందించిన అఖిలేష్ యాదవ్..బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, శూల్​దేవ్​ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్​భర్ కలిసి ఏర్పాటు చేసిన భాగీదారీ మోర్చాతో ఎస్పీ పొత్తుపై ప్రశ్నించగా.. వారితో ఇంకా చర్చించలేదని అఖిలేష్ తెలిపారు.

ఇక, వివిధ అంశాలపై సమాజ్ వాదీ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్-బీఎస్పీని ఉద్దేశించి..కాంగ్రెస్​, బీఎస్పీ పార్టీలు తాము పోరాడాల్సింది ఎవరితోనో తెలుసుకోవాలని సూచించారు. బీఎస్పీ సహా ఇతర పార్టీలు.. బ్రాహ్మణుల​ సమ్మేళనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎస్పీ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయనుందని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఎస్పీ నేత జనేశ్వర్ మిశ్రా జయంతి సందర్భంగా ఆగస్టు 5న యాత్ర చేపడతామన్నారు. బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15 నుంచి మరిన్ని యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇక,కొద్ది రోజులగా పార్లమెంట్ ని కుదిపేస్తున్న పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై అఖిలేష్ స్పందించారు. పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రాన్ని తప్పుబట్టారు అఖిలేష్. ఎన్డీయేకి లోక్ సభలో 350కి పైగా సీట్లు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎందుకోసం మరియు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏం కనుక్కోవాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అఖిలేష్ ప్రశ్నించారు. ఈ చర్యతో బీజేపీ.. విదేశీ శక్తులకు సాయం చేస్తున్నట్లు అఖిలేష్ ఆరోపించారు.