పాట్నా ఎయిమ్స్ లో 384మంది వైద్య సిబ్బందికి కరోనా

బీహార్‌ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కరోనా కలకలం రేపింది.

పాట్నా ఎయిమ్స్ లో 384మంది వైద్య సిబ్బందికి కరోనా

Aiims Patna

AIIMS Patna బీహార్‌ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో కరోనా కలకలం రేపింది. బుధవారం ఎయిమ్స్ ఆసుప‌త్రిలోని 384 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వారిలో డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది ఉన్నారు. పెద్దసంఖ్యలో వెద్యసిబ్బంది కరోనా బారినపడుతుండటంతో అక్కడి ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, వైద్యం అందించేందుకు వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

కాగా, పాట్నా ఎయిమ్స్ లో క‌రోనా సోకిన వైద్య సిబ్బంది సంఖ్య 700 దాటింది. రాజధానిలోని దవాఖానల్లోని 90 శాతం మంది వైద్యులు, సిబ్బంది కరోనా వైరస్‌కు గురయ్యారని అధికారి ఒకరు చెప్పారు. పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవల పరిస్థితి దయనీయంగా తయారైంది.

బీహార్‌లో గత కొన్నిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో సెకండ్‌ వేవ్‌ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కొవిడ్ పేషెంట్లతో అన్ని జిల్లా కేంద్రాలతోపాటు రాజధాని పాట్నాలోని దవాఖానల్లోని బెడ్లు అన్నీ నిండిపోయాయి. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు చాలా డిమాండ్ ఏర్పడింది.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీహార్‌లో మే-15వరకు నైట్ కర్ఫ్యూతో కూడిన పాక్షిక లాక్ డౌన్ విధించారు.క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతుండ‌టంతో పంచాయ‌తీ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌ను కూడా ర‌ద్దు చేశారు. బీహార్‌లో మంగ‌ళ‌వారం కొత్త‌గా 10,455 క‌రోనా కేసులు, 51 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,42,059కు, మ‌ర‌ణాల సంఖ్య 1,841కు పెరిగింది.