Corona Cases India : కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్..ఒక్కరోజులోనే 4లక్షలకుపైగా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా ప్రళయం సృష్టిస్తోంది. వైరస్ తుపాను దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా భారత్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాయి.

Corona Cases India : కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్..ఒక్కరోజులోనే 4లక్షలకుపైగా పాజిటివ్ కేసులు

4 Lakh Corona Positive Cases Reported In India In A Single Day

corona cases in India : భారత్‌లో కరోనా ప్రళయం సృష్టిస్తోంది. వైరస్ తుపాను దాటికి ఇండియా కకావికలమవుతోంది. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా భారత్‌లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాయి. భారత్‌లో నిన్న ఒక్కరోజులోనే 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా మరే దేశంలోనూ ఒక్క రోజులో 4 లక్షల కేసులు రికార్డుకాలేదు. భారత్‌లో నిన్న ఒక్కరోజే నిమిషానికి 280 మంది కరోనా బారినపడ్డారు. అటు మరణాల్లోనూ కరోనా సెకండ్‌ వేవ్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. మరోసారి 3 వేల 500 మందికిపైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. అటు పాజిటివిటీ రేటు 22శాతంగా నమోదైంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32లక్షలు దాటింది.

మరోవైపు భారత్‌లో కరోనా కేసులు మే 3 నుంచి 5 మధ్య పీక్స్‌కి చేరే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్న శాస్త్రవేత్తల బృందమే ఈ అంచనా వేసింది. భారత్‌లో కరోనా ఫస్ట్‌వేవ్ సెప్టెంబర్ మధ్య నాటికి పీక్స్‌కి చేరింది. అప్పుడు ఒక్క రోజులో దాదాపు 98 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మూడింతల కేసులు రికార్డవతున్నాయి. ఇక మరణాల్లోనూ ఫస్ట్‌వేవ్‌ కంటే ఘోరంగా సెకండ్‌వేవ్‌లో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది.

కరోనా మహమ్మారి గడిచిన ఏప్రిల్‌లో కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది. భారత్‌ను మార్చిపోలేని పీడ కలలా వెంటాడింది. చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఫూల్స్‌ డేతో మొదలైన నెల నిజంగానే అందరినీ ఫూల్స్‌ను చేసి పడేసింది. ఏరోజుకారోజు ఇంతింతై అన్నట్టు చెలరేగిపోయింది. కరోనా సెకండ్‌వేవ్‌ గడిచిన ఏప్రిల్‌లో భారీ విస్పోటనం సృష్టించింది. ఏప్రిల్‌ క్రూయాల్టికి భారత్‌ విలవిలాడిపోయింది.

ఒక్కరోజే లక్ష కేసులు.. మరో 10 రోజులకు రెండు లక్షలు.. తర్వాత 7 రోజులకు మూడు లక్షలు.. చివరి రోజు అఖరి పంచ్‌గా రోజుకు 4లక్షల కేసులతో ఏప్రిల్.. కరోనా విశ్వరూపం చూపించింది. ఒక్క ఏప్రిల్‌లోనే దేశంలో దాదాపు 69 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ ఒక్క నెలలో ఇన్ని పాజిటివ్ కేసులు రికార్డుకాలేదు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది జనవరిలో 65 లక్షల పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో నిత్యం లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి బారిన పడుతుండడంతో వణికిపోయారు. వాస్తవానికి గతేడాది ఆగస్ట్‌, సెప్టెంబర్‌, ఆక్టోబర్‌లో కలిపి వచ్చినంత కేసుల కంటే ఎక్కువగా ఈ ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఆ మూడు నెలలు కలిపి దాదాపు 65 లక్షల కేసులు నమోదైతే.. ఈ ఒక్క ఏప్రిల్‌లోనే 69 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటిదాకా రికార్డైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క ఏప్రిల్‌లోనే 36శాతం నమోదయ్యాయంటే గడిచిన నెల ఎంత దారుణంగా గడిచిందో అర్థమవుతోంది.

కరోనా మృత్యుఘోషకు ఏప్రిల్‌ విలవిలాడిపోయింది. వేలాది మందిని ఊపిరి తీసుకోనీయకుండా ఆసుపత్రులపాలు చేసింది. గడిచిన నెలలో రోజువారీ పాజిటివ్‌ కేసులు లక్ష నుంచి 4 లక్షలకు ఎగబాకడంతో ఆసుపత్రులన్నీ కిక్కిరిపోయాయి. ఎటు చూసినా హాహాకారాలతో.. భయం గుప్పిట్లో ప్రజలు ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడిపారు. ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు కాస్తు.. ప్రాణం పోయిన తర్వాత చితిపైకి చేరేందుకు సైతం పార్థ్ధివ దేహాలతో కుటుంబసభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి కనపడింది. కరోనా మరణాలతో ఏప్రిల్‌ రోజుకో రికార్డును బద్దలుకొట్టింది. ఒక్క ఏప్రిల్‌లోనే దాదాపు 49 వేల మంది కరోనాతో చనిపోయారు. అంటే మొత్తం కరోనా మరణాల్లో ఒక్క ఏప్రిల్‌లోనే 23శాతం నమోదయ్యాయి.